సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నల్లగండ్లలోని పెద్దచెరువు నీటి సామర్థ్య పరిధిలో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ విధమైన నిర్మాణాలూ చేయకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నల్లగండ్ల చెరువు శిఖం భూములను అపర్ణ కంపెనీ కొనుగోలు చేసి ఇండ్ల నిర్మాణాల సముదాయాన్ని నిర్మిస్తోందని, చెరువు నీటి సామర్థ్య పరిధిలో రోడ్డు, గోడలు నిర్మాణం చేస్తోందంటూ ‘జనం కోసం’అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
దీనిని హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అపర్ణ సంస్థ ఎలాంటి నిర్మాణాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. అపర్ణతోపాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, శేరిలింగంపల్లి పరిధిలోని డిప్యూటీ కమిషనర్లకు ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసింది. చెరువు ఎల్‌టీఎఫ్ పరిధిలో నిర్మాణాలు చేయకుండా చర్యలు తీసుకోవడంతోపాటు చెరువులో చెత్త వేయకుండా చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment