అజహరుద్దీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో ‘గ్రేటర్’ చిచ్చు రాజుకుంది. ఈ చిచ్చు కారణం మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అజహరుద్దీన్ ఇటీవల చేసిన ప్రకటన.. గ్రేటర్ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. అజార్ ప్రకటనపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ భగ్గుమన్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి ఈ సారి తానే పోటీ చేయబోతున్నట్లు ఆయన సమావేశంలో స్పష్టం చేశారు. అజహరుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంజన్ కుమార్ మాట్లాడుతుండగా మాజీ ఎంపీ వీ హనుమంతరావు విసురుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే అంజన్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా, అజహరుద్దీన్‌కు వ్యతిరేకంగా కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. మధ్యలో కల్పించుకున్న మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ.. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ అంజన్‌దేనని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని నచ్చజెప్పారు. మరోవైపు ఈ సమావేశానికి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్, ఆయన తనయుడు విక్రమ్‌గౌడ్‌లు హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment