వాణిజ్య భవన అనుమతులూ ఆన్‌లైన్‌లోనే..!
జీహెచ్‌ఎంసీలో సోమవారం నుంచి శ్రీకారం
⇒ ఇప్పటికే లేఔట్లు, నివాస భవన అనుమతులు ఆన్‌లైన్ ద్వారానే..
⇒ టౌన్ ప్లానింగ్‌లో మాన్యువల్ ఫైలింగ్‌కు తెర
⇒ అవినీతికి ఆస్కారం ఉండదు.. పారదర్శకతకు పెద్దపీట
⇒ ఆన్‌లైన్ విధానంపై ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకూ నివాస భవన నిర్మాణ, లేఔట్ల అనుమతులను ఆన్ లైన్ ద్వారా జారీ చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ).. ఇకపై బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య భవ నాల నిర్మాణాల అనుమతులను సైతం ఆన్ లైన్ లోనే జారీ చేయనుంది. సోమవారం (20వ తేదీ) నుంచి దీనికి శ్రీకారం చుడు తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం గత ఏడాది జూన్ నుంచి నివాస భవనాలు, లేఔట్ల అనుమతుల జారీని ఆన్‌లైన్‌లో ప్రారం భించింది.
మొదట్లో ఇబ్బందులు ఎదురైనా.. ప్రస్తుతం దారిన పడటంతో వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలకూ ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీ చేపట్టనుంది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే టౌన్ ప్లానింగ్‌లో ఇక మాన్యు వల్ ఫైలింగ్ అనేది ఉండదు. దరఖాస్తులో ఏవైనా లోపాలుంటే సంబంధిత సాఫ్ట్‌వేరే గుర్తిస్తుంది. తిరిగి సరిచేసి దరఖాస్తును అప్ లోడ్ చేయవచ్చు. అనుమతుల జారీలోనూ మానవ జోక్యం ఉండదని, తద్వారా టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి మచ్చ తొలగిపోనుందని అధికారులు భావిస్తు న్నారు. వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల అనుమతులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేసే విధానంపై నగరంలోని ఆర్కిటెక్ట్‌లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ప్లానర్లకు సోమవారం ప్రత్యేక అవగాహన చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.
విద్యుత్ ఆదా కోసం ఈసీబీసీ వర్తింపు..
వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసేవారు నివాస భవ నాలకంటే అదనంగా ఫైర్ సర్వీస్ నుంచి ఎన్‌ఓసీ, పర్యావరణ క్లియరెన్స్‌తోపాటు తగి నంత పార్కింగ్ స్థలం, ఈసీబీసీ (ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్)ని అమలు చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ఆదా కోసం ఈసీబీసీని వర్తింపచేయనున్నారు. తొలుత వాణిజ్య భవ నాలు, ప్రభుత్వ, కార్పొరేట్ కార్యాలయాలకు దీనిని పాటించాలని గత ఏడాదే జీహెచ్‌ఎంసీ నిర్ణయించినా అమలు చేయడం లేదు. ట్రాఫి క్, భారీ ఇంధన వినియోగం వల్ల కాలుష్యం ఆందోళనకరస్థాయికి చేరడంతో దీన్ని అధి గమించేందుకు ఈ చర్యలకు సిద్ధమయ్యారు.
ఇవీ ప్రయోజనాలు..
ఆన్‌లైన్ ద్వారా అనుమతుల జారీతో పారదర్శకత పెరగడమే కాక.. పలు ఇబ్బందులు తప్పనున్నాయి. ఉన్న చోటు నుంచే ఆన్‌లైన్ ద్వారా 24 గంటల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చు. తొలుత దరఖాస్తు చేసిన వారికి తొలుత ప్రాతిపదికన దరఖాస్తుల్ని పరిశీలిస్తారు. ఫైలు ఎక్కడ ఉన్నదీ ఎప్పటికప్పుడు ఈమెయిల్/ఎస్‌ఎంఎస్/వెబ్‌పోర్టల్ ద్వారా సమాచారం అందుతుంది. నిబంధనల మేరకు ఆటోమేటిక్‌గా దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. తద్వారా పారదర్శకత ఉంటుంది. ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ సాఫ్ట్‌వేరే కనిపెడుతుందని, ఫైళ్లు, రికార్డులు ఎక్కడకీ పోవని.. మధ్యలో కాగితాలు మాయం కావని.. డిజిటల్ పత్రాలు అన్నివేళలా అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.