సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాల విప్లవాన్ని సాధించే జాతీయ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న తోడ్పాటు బాగుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్‌ఎల్) సీఈవో విశాల్ కపూర్ ప్రశంసలు కురిపించారు. విద్యుత్ వాహనాల(ఈవీ)పై ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్), సీఈఎస్‌ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను ఈఈఎస్‌ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు.
ఈ ఏడాది ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహæనాల అమ్మకాల్లో 80 శాతం వృద్ధి కనిపిస్తోందని, 2030 నాటికి మొత్తం వాహనాల్లో 30 శాతం ఈవీలే ఉండాలనేది కేంద్రం లక్ష్యమని విశాల్ కపూర్ అన్నారు. తద్వారా రానున్న ఏడేళ్లలో 846 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను, 474 మిలియన్ టన్నుల చమురు దిగుమతులను తగ్గించవచ్చని వివరించారు. ఇందులో భాగంగా ఈఈఎస్‌ఎల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ–బస్సుల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పారు. సాధారణ బస్సులతో పోల్చితే ఈ–బస్సులు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలందిస్తాయన్నారు.
విద్యుత్ వాహనాల విప్లవానికి ఏపీ నాంది పలికిందని విశాల్ కపూర్ ప్రశంసించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తూ ఉద్యోగులకు లక్ష ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఏపీలో ప్రస్తుతం 65 వేల విద్యుత్ వాహనాలుండగా, 2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాల్లో సగం ఈవీలే ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇంధన శాఖ అధికారులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 400 ఈవీ చార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 266 స్టేషన్లు పనిచేస్తున్నాయని, మరో 115 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment