మాట్లాడుతున్న పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి
కడ్తాల్: వాతావరణ మార్పుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లిలోని ఎర్త్ సెంటర్‌లో, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ‘క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్’ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడారు. కాప్–26 సదస్సు నిరాశ పరిచిందని, పర్యావరణవాదుల ఆశలను నీరుగార్చిందని అభిప్రాయపడ్డారు.
పబ్లిక్ పాలసీ నిపుణుడు దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో రసాయన ఎరువులను వాడటం వల్ల, భూమిలో కర్బన శాతం పెరిగి, ఆహార పంటల్లో పోషక విలువలు తగ్గుతున్నాయని చెప్పారు. దీంతో మనిషి జీవన ప్రమాణ రేటు తక్కువగా ఉంటుందన్నారు. తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలపై రైతులు దృష్టి సారించాలని, వర్షాధార పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల జీవనశైలి, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు.
గ్లాస్గో నగరంలో నిర్వహిస్తున్న కాప్–26 సదస్సులో చర్చించిన అంశాలను, క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకుపోవాలనే లక్ష్యంతో స్థానిక ఎర్త్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీజీఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతీఒక్కరు కనీసం ఐదు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయిభాస్కర్‌రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, ధర్మసేవ ట్రస్ట్ చైర్మన్ నిశాంత్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వికాస్, నాగరాజు, అర్చన, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, సిటీ కాలేజీకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment