బెంగళూరు: ఉద్యాననగరిలోని సరస్సులను కబ్జా చేయడానికి తెరవెనక ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలోని కొంత మంది బడా నాయకులే కబ్జాదారులతో చేతులు కలిపి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారని దీంతో మరి కొన్నేళ్లలో నగరంలో సరస్సులు ఉన్న ప్రాంతాల్లో భవనాలు వెలిసే ప్రమాదం ఉందని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీబీఎంపీ పరిధిలో 183 సరస్సులు
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీ ఎంపీ) పరిధిలో 183 సరస్సులు ఉన్నట్లు ఆ విభాగం గుర్తించింది. ఈ సరస్సులు 7,209 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. అయితే వీటిలో 80 శాతం సరస్సుల్లో పూడిక పేరుకుపోవడం, నాచు పెరిగింది. దీంతో ఆహ్లాదాన్ని పంచాల్సిన సరస్సులు అధ్వానం గా తయారయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి నగరంలో అవసాన దశలో ఉన్న 132 సరస్సులను అభివృద్ధికి గాను దాదాపు ఐదేళ్ల క్రితం ప్రభుత్వం బీబీఎంపీకి నిధులు విడుదల చేసింది. సరస్సులోని పూడిక, నాచును తొలగించడం దాని చుట్టూ ఉన్న భూభాగం ఆక్రమణకు గురికాకుండా చూడటం బీబీ ఎంపీ ప్రధానవిధి. చుట్టుపక్కల పర్యాటకులను ఆకర్షించేలా రాళ్లతో కృత్రిమ శిల్పాలు నెలకొల్పడం, చెట్లు పెంచడం, చిన్నచిన్న రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం కూడా సరస్సుల అభివృద్ధి, ఆధునికీకరణలో భాగమే. మొదట్లో బాగానే సాగిన పనులు హ ఠాత్తుగా ఆగిపోయాయి. తమ వద్ద తగిన సిబ్బంది లేరని అందువల్ల సరస్సులను పర్యవేక్షించడానికి సాధ్యం కాదని బీబీఎంపీ చేతులెత్తేసింది. ఈమేరకు ప్రభుత్వానికి ఆరునెలల ముందు నివేదిక అందజేసింది. దీంతో వెంటనే ప్రభుత్వం సరస్సుల అభివృద్ధిని బెంగళూరు డెవెలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ)కి అప్పగించింది. అయితే ఈ విషయం లక్ష్మణరావు కమిటీ సిఫార్సులకు వ్యతిరేకమని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నివేదిక ఏం చెబుతుంది...
నగరంలో సరస్సుల అభివృద్ధిపై 1988లో ప్రముఖ సామాజిక పర్యావరణ వేత్త లక్ష్మణరావు నేతృత్వంలోని కమిటీ అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీని ప్రకారం సరస్సుల అభివృద్ధిని ప్రభుత్వమే చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకాని, ప్రభుత్వ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు గాని అందచేయకూడదనేది ఆనివేదికలోని ప్రధాన సారాంశం. బీడీఏ అనేది ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే సంస్థ. దీని ప్రధాన విధి నగరంలోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని వాటిని అభివృద్ధి చేసి ప్రైవేట్ వ్యక్తులకు కానీ, సంస్ధలకు కానీ అప్పగించడం. అందువల్ల సరస్సుల అభివృద్ధిని బీడీఏకి అప్పగిస్తే అభివృద్ధి ముసుగులో సరస్సులు, వాటి చుట్టుపక్కల ఉన్న భూభాగంలో వాణిజ్య భవంతులను నిర్మించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం పై బీడీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ బీబీఎంపీ నుంచి ప్రభుత్వానికి లేఖ రాయించడం, తర్వాత ఆ పనులు బీడీఏకు దక్కడం వెనక రాష్ట్ర మంత్రి మండలిలో ప్రముఖ స్థానంలో ఉన్న ఓ మంత్రితో పాటు బెంగళూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉంది. బీడీఏ పనులన్ని ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అభివృద్ధి పేరుతో సరస్సులకు చెందిన భూ భాగాన్ని ఆక్రమించడమే ఆయన ముందున్న లక్ష్యం’. అని పేర్కొన్నారు.
కబ్జా కోరల్లో నగర సరస్సులు
Published Mon, Sep 7 2015 2:56 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement