జస్టిస్ చల్లా కోదండరామ్
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లో రూపొందించిన నిబంధనలు అమలవుతున్న దాని కంటే ఉల్లంఘించడమే ఎక్కువగా ఉంది. వీటిని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగానికి ఎంత మాత్రం బాధ్యత కనిపించడం లేదు. ప్రజలు మౌనంగా ఈ దారుణమైన శబ్ద కాలుష్యాన్ని భరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏరియాలో దీనికి నేనూ ఓ బాధితుడినే. ఉదయం 4 గంటల నుంచే మైకుల నుంచి భక్తి పాటలు, అయ్యప్ప భజనలు, మసీదుల నుంచి ఉదయ ప్రార్థనలు మొదలవుతాయి. మా ఏరియాలో పెద్ద సంఖ్యలో మసీదులున్నాయి. ఈ శబ్ద కాలుష్యం హైకోర్టు మాత్రమే తగిన చర్యలు తీసుకోగలదు.అధికారులను, ఉల్లంఘనులను బాధ్యులను చేసి, ప్రశాంతత నెలకొనేలా చూడగలరు.
– న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్
శబ్ద కాలుష్య బాధను భరించలేని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సరైన సందర్భం దొరకడంతో తన గోడును హైకోర్టుకే వెళ్లబోసుకున్నారు. ఇదే అంశంపై గుంటూరు, ఎల్‌ఐసీ కాలనీకి చెందిన వి.వి.సుబ్బారావు అనే వ్యక్తి రాసిన లేఖను పిల్‌గా పరిగణించాలని ఆయన సిఫారసు చేశారు. జస్టిస్ కోదండరామ్ అభిప్రాయంతో న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్, పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్‌లు సైతం ఏకీభవించారు. ఇలా ఏదైనా అంశంపై హైకోర్టుకు లేఖలు రాస్తే, ఆ లేఖలను పిల్‌గా పరిగణించాలా?వద్దా? అన్న అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తుల పిల్ కమిటీ తేలుస్తుంది.దీంట్లో జస్టిస్ కెయిత్, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కోదండరామ్, జస్టిస్ భట్, జస్టిస్ సీతారామమూర్తిలున్నారు. శబ్ద కాలుష్య నియంత్రణకు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని పాటించడం లేదంటూ వి.వి.సుబ్బారావు ఈ ఏడాది ఆగస్టులో హైకోర్టుకు లేఖ రాశారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుల నుంచి లౌడ్ స్పీకర్ల ద్వారా ఒక రోజులో దాదాపు 18 గంటల పాటు భక్తిగీతాలు, ప్రార్థనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వస్తున్నాయని, ఈ శబ్ద కాలుష్యాన్ని భరించలేకపోతున్నామని ఆ లేఖలో వివరించారు. ఈ కాలుష్యం దెబ్బకు ఇళ్లల్లో ఫోన్లు మాట్లాడలేకపోతున్నామన్నారు. ఇళ్లలో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోలేకపోతున్నామని వివరించారు. పిల్లలు చదవలేక, పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నారని తెలిపారు. వృద్ధులు, రోగులు నిద్ర కూడా పోలేకపోతున్నారన్నారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు రిజిస్ట్రీ దీనిని పిల్ కమిటీకి నివేదించింది.
ఆవేదనకు అక్షరరూపమిచ్చిన కోదండరామ్...
ఈ లేఖను పరిశీలించిన కమిటీలో ఐదుగురు న్యాయమూర్తులు కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందులో జస్టిస్ సీతారామమూర్తి ఈ లేఖను పిల్‌గా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. శబ్ద కాలుష్యానికి తానూ ఓ బాధితుడినేనంటూ జస్టిస్ కోదండరామ్ తన ఆవేదనకు అక్షరరూపం ఇచ్చారు. తన వేదనను ఆయన అందులో ప్రస్తావించారు. సుబ్బారావు రాసిన లేఖను పిల్‌గా పరిగణించాలని కోరారు.దీంతో మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఏకీభవించారు. హైకోర్టు రిజిస్ట్రీ, పిల్ కమిటీ అభిప్రాయాలను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచింది.
నోటీసులిచ్చిన ధర్మాసనం...
వాటిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు సుబ్బారావు లేఖను పిల్‌గా పరిగణించాలని రిజిస్ట్రీకి పాలనాపరమైన ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రీ ఆమేరకు చర్యలు తీసుకోవడంతో దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. కౌంటర్లు వేయాలని విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment