Justice Challa kodandaram
-
ఆదివాసులను ఖాళీ చేయించవద్దు
సాక్షి, హైదరాబాద్: అటవీ నివాసుల హక్కుల చట్టంలో నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా అటవీ ప్రాంతాల్లో ఉండే ఆదివాసులను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వివిధ కేసుల్లో ఆదేశాలు జారీ చేశారు. కటాఫ్ తేదీకి ముందే వారు అడవిలో నివసిస్తున్నారో లేదో నిర్ణయించే పనిని చట్టంలో నిర్దిష్ట అధికారికి అప్పగించాలని ఉందని తెలిపారు. దాని ప్రకారమే చర్యలు తీసుకోవాలని, చట్ట విధానాన్ని పాటించకుండా పిటిషనర్లను ఖాళీ చేయించవద్దని అటవీ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేడబ్ల్యూ చౌడవరం, కిస్తారాం.. మహబూబాబాద్ జిల్లా వెంకటాపురం, మడగూడెం.. కొత్తగూడెం జిల్లా లింగగూడెం, విజయవారిగూడెం ప్రాంతాలకు చెందిన పలువురు ఆదివాసీయులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం విచారించింది. గిరిజనుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అటవీ నివాసుల చట్ట నిబంధనలకు విరుద్ధంగా అటవీ అధికారులు తమను బలవంతంగా నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తున్నారని, ఆ చట్టం ప్రకారం సంప్రదాయ అటవీ నివాసాల్లో ఉండేలా తమకు హక్కులు ఉన్నాయని తెలిపారు. తమను గిరిజనేతరులుగా ముద్ర వేసి అటవీ ప్రాంతాల నుంచి అన్యాయంగా పంపిస్తున్నారని పిటిషనర్లు వాపోయారు. అటవీ నివాసుల చట్టం గ్రామసభ అని సూచిస్తుందని, దాని ప్రకారం ఈ ప్రాంత నివాసుల జాబితాను సిద్ధం చేయాలని, ఆ జాబితాను సబ్ డివిజనల్ స్థాయిలో చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీకి పంపాల్సి ఉంటుందని వారు వాదించారు. కాగా, 2012 నుంచి ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ ప్రాంతాలకు వలస వచ్చిన వారు ఆక్రమణదారులని, అటవీ చట్టం ప్రకారం వారు ఆదివాసీయులు కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తే స్పందించకుండా హైకోర్టును ఆశ్రయించారని తెలిపింది. 2005 డిసెంబర్ 13 తర్వాత ఈ ప్రాంతాలకు వలస వచ్చిన వారు ఆక్రమణదారులేనని చెప్పింది. -
నేనూ బాధితుడినే...!
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లో రూపొందించిన నిబంధనలు అమలవుతున్న దాని కంటే ఉల్లంఘించడమే ఎక్కువగా ఉంది. వీటిని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగానికి ఎంత మాత్రం బాధ్యత కనిపించడం లేదు. ప్రజలు మౌనంగా ఈ దారుణమైన శబ్ద కాలుష్యాన్ని భరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏరియాలో దీనికి నేనూ ఓ బాధితుడినే. ఉదయం 4 గంటల నుంచే మైకుల నుంచి భక్తి పాటలు, అయ్యప్ప భజనలు, మసీదుల నుంచి ఉదయ ప్రార్థనలు మొదలవుతాయి. మా ఏరియాలో పెద్ద సంఖ్యలో మసీదులున్నాయి. ఈ శబ్ద కాలుష్యం హైకోర్టు మాత్రమే తగిన చర్యలు తీసుకోగలదు.అధికారులను, ఉల్లంఘనులను బాధ్యులను చేసి, ప్రశాంతత నెలకొనేలా చూడగలరు. – న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శబ్ద కాలుష్య బాధను భరించలేని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సరైన సందర్భం దొరకడంతో తన గోడును హైకోర్టుకే వెళ్లబోసుకున్నారు. ఇదే అంశంపై గుంటూరు, ఎల్ఐసీ కాలనీకి చెందిన వి.వి.సుబ్బారావు అనే వ్యక్తి రాసిన లేఖను పిల్‌గా పరిగణించాలని ఆయన సిఫారసు చేశారు. జస్టిస్ కోదండరామ్ అభిప్రాయంతో న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్, పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్లు సైతం ఏకీభవించారు. ఇలా ఏదైనా అంశంపై హైకోర్టుకు లేఖలు రాస్తే, ఆ లేఖలను పిల్‌గా పరిగణించాలా?వద్దా? అన్న అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తుల పిల్ కమిటీ తేలుస్తుంది.దీంట్లో జస్టిస్ కెయిత్, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కోదండరామ్, జస్టిస్ భట్, జస్టిస్ సీతారామమూర్తిలున్నారు. శబ్ద కాలుష్య నియంత్రణకు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని పాటించడం లేదంటూ వి.వి.సుబ్బారావు ఈ ఏడాది ఆగస్టులో హైకోర్టుకు లేఖ రాశారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుల నుంచి లౌడ్ స్పీకర్ల ద్వారా ఒక రోజులో దాదాపు 18 గంటల పాటు భక్తిగీతాలు, ప్రార్థనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వస్తున్నాయని, ఈ శబ్ద కాలుష్యాన్ని భరించలేకపోతున్నామని ఆ లేఖలో వివరించారు. ఈ కాలుష్యం దెబ్బకు ఇళ్లల్లో ఫోన్లు మాట్లాడలేకపోతున్నామన్నారు. ఇళ్లలో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోలేకపోతున్నామని వివరించారు. పిల్లలు చదవలేక, పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నారని తెలిపారు. వృద్ధులు, రోగులు నిద్ర కూడా పోలేకపోతున్నారన్నారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు రిజిస్ట్రీ దీనిని పిల్ కమిటీకి నివేదించింది. ఆవేదనకు అక్షరరూపమిచ్చిన కోదండరామ్... ఈ లేఖను పరిశీలించిన కమిటీలో ఐదుగురు న్యాయమూర్తులు కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందులో జస్టిస్ సీతారామమూర్తి ఈ లేఖను పిల్‌గా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. శబ్ద కాలుష్యానికి తానూ ఓ బాధితుడినేనంటూ జస్టిస్ కోదండరామ్ తన ఆవేదనకు అక్షరరూపం ఇచ్చారు. తన వేదనను ఆయన అందులో ప్రస్తావించారు. సుబ్బారావు రాసిన లేఖను పిల్‌గా పరిగణించాలని కోరారు.దీంతో మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఏకీభవించారు. హైకోర్టు రిజిస్ట్రీ, పిల్ కమిటీ అభిప్రాయాలను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచింది. నోటీసులిచ్చిన ధర్మాసనం... వాటిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు సుబ్బారావు లేఖను పిల్‌గా పరిగణించాలని రిజిస్ట్రీకి పాలనాపరమైన ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రీ ఆమేరకు చర్యలు తీసుకోవడంతో దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. కౌంటర్లు వేయాలని విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
సినిమాలతో సమాజంపై దుష్ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: సమాజంపై సినిమాల దుష్ప్రభావం చాలా ఉందని, మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తుండడం వల్లే వ్యభిచారానికి డిమాండ్ పెరిగిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వ్యాఖ్యానించారు. సినిమాల ప్రభావంతో 21 ఏళ్ల వయసులోనే యువత పెడదోవ పడుతున్నారని పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో కలసి సినిమాలు చూసే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్, ప్రజ్వల, తెలుగు సినీ పరిశ్రమల ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘స్టాప్ డిమాండ్ ఇన్ సెక్స్ ట్రాఫికింగ్’ప్రచారోద్యమం ప్రారంభోత్సవంలో జస్టిస్ కోదండరాం మాట్లాడారు. ఇకముందైనా మంచి సినిమాలు తీయాలని సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీనిపై స్పందించారు. ప్రేక్షకులకు ఆహ్లాదం పంచాలనే లక్ష్యంతో సినిమాలు తీస్తున్నామని, కుటుంబసభ్యులతో కలసి చూడదగిన రీతిలోనే సినిమాలు తీస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలో చైతన్యం తేవాలి.. మహిళల అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా పేర్కొన్నారు. అమెరికాలో మహిళల అక్రమ రవాణా నిరోధానికి అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని తెలిపారు. సమాజంలో చైతన్యం తేవడం ద్వారా వ్యభిచారానికి డిమాండ్ తగ్గి.. మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కనుమరుగవుతాయని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి నెలా సగటున 60 మంది మహిళలను వ్యభిచార కూపాల నుంచి రక్షిస్తున్నామని చెప్పారు. కాగా.. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారికి మంచి సమాజాన్ని ఇవ్వాలన్నదే తన తాపత్రయమని సినీ నటుడు మంచు విష్ణు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు కేంద్రం త్వరలో కొత్త చట్టం తీసుకురానుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళల అక్రమ రవాణా, వ్యభిచారానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సునీతా కృష్ణన్‌ను జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ నవీన్‌రావు, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, అక్కినేని అమల, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ తదితరులు అభినందించారు. -
మా ఆదేశాలకు లోబడి ఉండాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల తుది జాబితా తాము వెలువరించబోయే ఉత్తర్వులకు అనుగుణంగా ఉండాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా సవరణల పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించేస్తున్నారని పేర్కొంటూ నగరంలోని అలియాబాద్‌కు చెందిన పి.వెంకటరమణ దాఖలు చేసిన వ్యాజ్యం శుక్రవారం ఉమ్మడి హైకోర్టులో విచారణకు వచ్చింది. ఓటర్ల తుది జాబితా వెల్లడించినా అది తాము వెలువరించే ఉత్తర్వులకు అనుగుణంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఆదేశించారు. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
మీ టర్నోవర్ ఎంతో చెప్పండి
⇒ ఎన్వియన్ ఇంజనీర్స్కు స్పష్టం చేసిన హైకోర్టు ⇒ అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామన్న ఎన్వియన్ సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై పిటిషన్ దాఖలు చేసిన చెన్నైకి చెందిన ఎన్వియన్ ఇంజనీర్స్ సంస్థ వార్షిక టర్నోవర్ వివరాలను ఉమ్మడి హైకోర్టు కోరింది. గత ఐదేళ్ల టర్నోవర్ వివరాలను తమ ముందుంచాలంది. అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధి బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే సత్తా ఉందో లేదో కూడా చెప్పాలని ఆదేశించింది. ఈ విషయాల్లో తమకు సంతృప్తి కలిగిం చాలని, ఆ తరువాతే మిగిలిన విషయాల్లోకి వెళతామంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అది స్విస్ చాలెంజ్ విధానం కాదు రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కోసం స్విస్ చాలెంజ్ విధానం కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ జారీ చేసిన జీవో 170కి సవరణలు చేస్తూ ఈ ఏడాది జనవరి 2న ప్రభుత్వం జీవో 1ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఎన్వియన్ ఇంజనీర్స్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుం డగా, న్యాయ మూర్తి జోక్యం చేసుకున్నారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో పాలు పంచుకునే విషయంలో మీరెంత (ఎన్వియన్) సీరియస్‌గా ఉన్నారు? పాల్గొనేంత సమర్థత మీకుందా? అని ప్రశ్నించారు. ప్రకాశ్‌రెడ్డి సమాధానమిస్తూ... తాము ప్రభుత్వం రూపొందించిన అర్హత నిబంధనలనే సవాలు చేస్తున్నామన్నారు. ప్రధాన ప్రతిపాదకుడిగా (ఓపీపీ) సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు ఏదైనా కంపెనీ పోటీగా బిడ్ సమర్పించి హయ్యస్ట్ బిడ్డర్‌గా నిలిస్తే, ఓపీపీ తన ప్రతిపాదనలను సవరించే అవకాశం ఉంటుందని, అదే అవకాశం హయ్యస్ట్ బిడ్డర్‌కు ఉందని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చేందుకేనని, ఇలాంటి నిబంధనలు స్విస్ చాలెంజ్‌లో ఇంకా ఉన్నాయన్నారు. అందుకే తాము ఓపెన్ టెండర్ విధానం అమలుకు కోరుతున్నామని వివరించారు. స్విస్ చాలెంజ్‌లో ఓపీపీ ఎటువంటి చర్చలు, అభ్యర్థనలు లేకుండా సుమోటో ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుం దన్నారు. ఇక్కడ సింగపూర్ కన్సార్టియం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సింగపూర్ కన్సార్టియంతో పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపిందన్నారు. ఇందుకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్‌నోటే సాక్ష్యమని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కోర్టు కోరిన వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. -
ఆ ఉత్తమ జర్నలిస్టులకూ అవార్డులివ్వండి
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ జర్నలిస్టులకు ప్రకటించిన నగదు అవార్డులను 8 వారాల్లోపు చెల్లించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 2012లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొందరు పాత్రికే యులను ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపిక చేసిందని, కొందరికి నగదు అవార్డు లిచ్చి, మరికొందరికి ఇవ్వకపోవడం వివక్ష చూపడమేనంటూ కొండూరి రమేశ్ బాబు, వనం వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తమ జర్నలిస్టుల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 33 మందిని ఎంపిక చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.ఎస్.అర్జునకుమార్ తెలిపారు. వీరిలో ఇద్దరికే నగదు అవార్డును అందజేసి, మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. ఈ వాదనలను పరిగణ నలోకి తీసుకున్న న్యాయమూర్తి అవార్డులు ఇవ్వనివారికి 8 వారాల్లోపు వాటిని చెల్లించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఉత్తమ విధినిర్వహణతో అత్యుత్తమ ఫలితాలు
జస్టిస్ చల్లా కోదండరామ్ హైదరాబాద్: ఉత్తమ వ్యక్తిత్వ వికాసంతోనే విధి నిర్వహణలో అత్యుత్తమ ఫలితాలను పొందగలమని జస్టిస్ చల్లా కోదండరామ్ అన్నారు. న్యాయవాదులు తమ వాదనా పటిమను పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాసం, భావవ్యక్తీకరణలో శిక్షణ ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. హైదరాబాద్ దోమలగూడ రామకృష్ణ మఠంలో తెలంగాణ, ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘న్యాయ వాదులకు వ్యక్తిత్వ వికాసం, కమ్యూని కేషన్ స్కిల్స్’పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులు ఆంగ్లంపై పట్టు సాధించాలని, కోర్టులో వాదనలకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని సూచించారు. వృత్తిలో ప్రతిభా పాటవాలు చూపితేనే ఉత్తమ న్యాయ వాదులుగా రాణిస్తారన్నారు. జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ.. న్యాయ వాదులు సమాజానికి మార్గదర్శ కులుగా ఉండాల న్నారు. రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద మాట్లాడుతూ.. న్యాయ వాదులు సమాజ సేవా కార్యక్రమాలతో పేదలకు న్యాయ సాయం అందించాలని కోరారు. న్యాయవాదులు ముందుకు వస్తే ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహిస్తామని తెలంగాణ అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, తెలంగాణ అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, కోశాధికారి నిరంజన్‌రెడ్డి, ఆంధ్ర అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాగర్లమూడి కోటేశ్వర్రావు, నాయకులు తుమిన్, భాస్కర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
హెచ్‌సీఏ ఎన్నికలకు పచ్చ జెండా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణకు కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అసోసియేషన్ కార్యదర్శి జాన్ మనోజ్ హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం బుధవారం విచారణ జరిపారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎన్నికలను యథాతథంగా జరుపుకోవచ్చన్నారు. ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశిస్తూ.. విచారణను 18కి వాయిదా వేశారు. అధ్యక్ష పదవికి భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పోటీ పడుతుండటంతో ఒక్కసారిగా హెచ్‌సీఏ ఎన్నికలు ఆసక్తిని పెంచాయి. -
జీవో 28పై ముగిసిన వాదనలు
నిర్ణయం రేపటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండల పరిధిలోని మీర్‌పేట, జిల్లెలగూడ, కొత్తపేట, బాలాపూర్, జల్లపల్లి, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలను డీ నోటిఫై చేసి మునిసిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఈ జీవోను కొట్టేసి, ఈ 6 గ్రామ పంచాయతీల విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సరూర్‌నగర్ మండల ప్రజా పరిషత్ సభ్యుడు తీగల విక్రంరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, ముందుగా పంచాయతీలకు నోటీసులు జారీ చేసి వారి అభిప్రాయం తెలుసుకున్న తరువాతనే మునిసిపాలిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. రెండేళ్ల క్రితం అంటే ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన షోకాజ్ నోటీసుల ఆధారంగా ఇప్పుడు డీ నోటిఫై నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి తోసిపుచ్చారు. ప్రభుత్వం నిబంధనల మేరకే ఆరు గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చిందన్నారు. ఇలా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. బుధవారం ఈ వ్యాజ్యంపై నిర్ణయం వెలువరిస్తానని స్పష్టం చేశారు. -
రూ.9 కోట్ల నిధులు మళ్లాయి
దర్యాప్తునకు ఆదేశించండి హైకోర్టులో ఆల్విన్ వాచెస్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఎస్బీహెచ్, ఇతర బ్యాంకుల్లో లిక్విడేషన్ (మూసివేత) కంపెనీల నిధుల మళ్లింపునకు సంబంధించి అధికార లిక్విడేటర్ (ఓఎల్) కార్యాలయ సిబ్బంది ప్రమేయంపై అనుమానం ఉంటే సమగ్ర వివరాలతో సీబీఐకి ఫిర్యాదు చేయాలని హైకోర్టు సోమవారం ఆల్విన్ వాచెస్ లిమిటెడ్ ఓఎల్‌ను ఆదేశించింది. ఓఎల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదుకు తిరస్కరించడానికి వీల్లేదని సీబీఐకి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్బీహెచ్లో తమ కంపెనీకి చెందిన రూ.9 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆల్విన్ వాచెస్ ఓఎల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సీబీఐకి ఫిర్యాదు చేయాలని రెండు రోజుల క్రితం ఆదేశించారు. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు రాగా, ఓఎల్ ఇచ్చిన ఫిర్యాదు సరిగా లేదని, సరైన వివరాలతో ఫిర్యాదు ఇచ్చి దర్యాప్తునకు అభ్యర్థించాలని ఓఎల్ తరఫు న్యాయవాదికి న్యాయమూర్తి సూచించారు. -
‘భూదాన్’ జీవో రద్దు హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జి.రాజేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 20న జారీ చేసిన జీవో 11ను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012లో ఏర్పాటు చేసిన ఏపీ భూదాన్ బోర్డు పాలక మండలి కాల పరిమితి 2016 వరకు ఉందని, ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ బోర్డు చైర్మన్ జి.రాజేందర్‌రెడ్డి, సభ్యులు ఎం.అంబదాస్, సి.వి.చారిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే బోర్డును రద్దు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎన్.నవీన్‌కుమార్ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, జీవో 11ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.