‘భూదాన్’ జీవో రద్దు హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జి.రాజేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 20న జారీ చేసిన జీవో 11ను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2012లో ఏర్పాటు చేసిన ఏపీ భూదాన్ బోర్డు పాలక మండలి కాల పరిమితి 2016 వరకు ఉందని, ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ బోర్డు చైర్మన్ జి.రాజేందర్‌రెడ్డి, సభ్యులు ఎం.అంబదాస్, సి.వి.చారిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే బోర్డును రద్దు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎన్.నవీన్‌కుమార్ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, జీవో 11ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.