
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల తుది జాబితా తాము వెలువరించబోయే ఉత్తర్వులకు అనుగుణంగా ఉండాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా సవరణల పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించేస్తున్నారని పేర్కొంటూ నగరంలోని అలియాబాద్‌కు చెందిన పి.వెంకటరమణ దాఖలు చేసిన వ్యాజ్యం శుక్రవారం ఉమ్మడి హైకోర్టులో విచారణకు వచ్చింది.
ఓటర్ల తుది జాబితా వెల్లడించినా అది తాము వెలువరించే ఉత్తర్వులకు అనుగుణంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఆదేశించారు. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.