ఉత్తమ విధినిర్వహణతో అత్యుత్తమ ఫలితాలు
జస్టిస్ చల్లా కోదండరామ్
హైదరాబాద్: ఉత్తమ వ్యక్తిత్వ వికాసంతోనే విధి నిర్వహణలో అత్యుత్తమ ఫలితాలను పొందగలమని జస్టిస్ చల్లా కోదండరామ్ అన్నారు. న్యాయవాదులు తమ వాదనా పటిమను పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాసం, భావవ్యక్తీకరణలో శిక్షణ ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. హైదరాబాద్ దోమలగూడ రామకృష్ణ మఠంలో తెలంగాణ, ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘న్యాయ వాదులకు వ్యక్తిత్వ వికాసం, కమ్యూని కేషన్ స్కిల్స్’పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులు ఆంగ్లంపై పట్టు సాధించాలని, కోర్టులో వాదనలకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని సూచించారు. వృత్తిలో ప్రతిభా పాటవాలు చూపితేనే ఉత్తమ న్యాయ వాదులుగా రాణిస్తారన్నారు. జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ.. న్యాయ వాదులు సమాజానికి మార్గదర్శ కులుగా ఉండాల న్నారు. రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద మాట్లాడుతూ.. న్యాయ వాదులు సమాజ సేవా కార్యక్రమాలతో పేదలకు న్యాయ సాయం అందించాలని కోరారు. న్యాయవాదులు ముందుకు వస్తే ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహిస్తామని తెలంగాణ అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, తెలంగాణ అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, కోశాధికారి నిరంజన్‌రెడ్డి, ఆంధ్ర అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాగర్లమూడి కోటేశ్వర్‌రావు, నాయకులు తుమిన్, భాస్కర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.