సాక్షి, హైదరాబాద్: బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న బీసీ న్యాయవాదులు ఈ వ్యవహారాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. అవసరమైతే మిగతా బీసీ సంఘాలను కూడా కలుపుకోవాలని భావిస్తున్నారు. బాబు తీరును ఖండిస్తూ మొదట రాష్ట్రపతికి లేఖ రాయాలని, తరవాత అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయనను కలవాలని భావిస్తున్నారు. బాబు వ్యక్తం చేసిన అనుచిత అభిప్రాయాలను లిఖితపూర్వకంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
ఈ మేరకు త్వరలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే, బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా చేసేందుకు కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు, ఈ మొత్తం వ్యవహారంలో ఏకంగా హైకోర్టునే తప్పుబట్టారు! జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ పి.కేశవరావు, జస్టిస్ గంగారావు, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయంపై ఆయన విస్మయకర రీతిలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొలీజియం నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా అభివర్ణించారు! అంతేకాక ఈ ఆరుగురు న్యాయమూర్తులుగా పనికి రారని ఒక్క ముక్కలో తేల్చేశారు. వారి నిజాయితీ, వృత్తిపరమైన సమర్థతను నిర్ధారించకుండానే వారి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేసిందంటూ ఆయన కొలీజియంపైనే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అసలు ఆ ఆరుగురిలో ఒక్కరికి కూడా న్యాయమూర్తులయ్యేంత శ్రేష్టత, సచ్చీలత లేనే లేవని కేంద్రానికి పంపిన ఫిర్యాదు లేఖలో బాబు పేర్కొన్నారు.
ఆరుగురు న్యాయమూర్తుల గురించి బాబు తన లేఖలో తీవ్ర అభ్యంతకరమైన పదజాలం ఉపయోగించిన నేపథ్యంలో సదరు లేఖను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వంగా ఈశ్వరయ్య రెండు రోజుల క్రితం బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. రెండు రాష్ట్రాల న్యాయవాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ ఆరుగురి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేయడం సరికాదంటూ ఒకింత రెచ్చగొట్టే పదజాలాన్ని కూడా బాబు ఉపయోగించారు. దీనిపై పలువురు విశ్రాంత న్యాయమూర్తులు తీవ్ర ఆశ్చర్యం, విస్మయం వ్యక్తం చేశారు.
బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమే గాక ఏకంగా కొలీజియం నిర్ణయాన్నే తప్పుపడుతూ లేఖ రాయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన సామాజిక వర్గానికి, తన కోటరీకి చెందిన న్యాయవాదులెవరూ జాబితాలో లేరన్న అసహనం బాబు లేఖలో స్పష్టంగా కనిపిస్తోందని వారు చెబుతున్నారు. బాబు అసహనాన్ని, ఆయన అభిప్రాయాల్లోని ఉద్దేశాలను గుర్తించే, వాటిని పట్టించుకోకుండా అమర్‌నాథ్ గౌడ్ తదితరులను జడ్జీలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు అనుమతించిందని వారు చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్రం ఈ ఆరుగురి విషయంలో మాత్రం ఆలస్యానికి తావులేకుండా నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బాబు తీరుపై ఫిర్యాదుకు..రాష్ట్రపతి వద్దకు బీసీ న్యాయవాదులు!
Published Wed, Apr 25 2018 4:40 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment