బాబుపై బీసీ న్యాయవాదుల ఆగ్రహం | BC lawyers fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

బాబుపై బీసీ న్యాయవాదుల ఆగ్రహం

Published Tue, Apr 24 2018 1:03 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

BC lawyers fires on CM Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో సీఎం చంద్రబాబు లిఖితపూర్వక వ్యాఖ్యలు న్యాయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. బీసీ న్యాయవాదులు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. బీసీలను అణగదొక్కేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆ వర్గానికి చెందిన న్యాయవాదులు సోమవారం హైకోర్టు వద్ద ఆందోళన చేశారు. ఇందులో ఉభయ రాష్ట్రాల బీసీ న్యాయవాదులు పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీసీ వ్యతిరేకి చంద్రబాబుకు తగిన బుద్ధి చెపుతామని, ఆయన ఆటలు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. బీసీల ఓట్లు కావాలిగానీ, బీసీలు జడ్జీలు కాకూడదా? అంటూ ప్రశ్నించారు. ‘టీడీపీ.. వాళ్ల సామాజిక వర్గానికి చెందిన ముగ్గురిని ఏకకాలంలో సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించుకుంది. మరోవైపు బీసీలు హైకోర్టు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాశారు. చంద్రబాబు వ్యాఖ్యలు చాలా దుర్మార్గం. ఏపీలో టీడీపీకి సమాధి కట్టే రోజు దగ్గర్లో ఉంది. ఇప్పటి వరకు బీసీ న్యాయవాదిని అడ్వొకేట్‌ జనరల్‌గా నియమించలేదు. ప్రధాన పోస్టులు కూడా ఇవ్వకుండా అవమానించారు’ అని హైకోర్టు బీసీ న్యాయవాది డీఎస్‌ఎన్‌వి ప్రసాద్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తన కులం వాళ్ల విషయంలో ఇలాగే చేశారా?
హైకోర్టు న్యాయమూర్తుల పదవులకు అమర్‌నాథ్‌గౌడ్‌తో పాటు మిగిలిన న్యాయమూర్తుల పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేసినప్పుడు, వారిపై  కేంద్ర న్యాయశాఖ మంత్రికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు లిఖితపూర్వకంగా> పంపిన అభిప్రాయాలను మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వంగా ఈశ్వరయ్య బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. సీఎం అభిప్రాయాలు న్యాయవర్గాలను విస్మయానికి గురి చేశాయి. తన వారు తప్ప, ఇతరులెవ్వరూ న్యాయమూర్తులు కాకూడదన్న ఉద్దేశం చంద్రబాబు అభిప్రాయాల్లో స్పష్టంగా కనిపిస్తోందని పలువురు విశ్రాంత న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

అమర్‌నాథ్‌గౌడ్‌ తదితరులను ఎట్టి పరిస్థితుల్లో జడ్జీలు కాకుండా చేసేందుకే చంద్రబాబు ఈ స్థాయికి దిగజారారని చెబుతున్నారు. తనకులానికి చెందిన వ్యక్తులు జడ్జీలుగా నియమితులైనప్పుడు చంద్రబాబు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారా? లేదా? అన్నది పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం హైకోర్టులో టాప్‌ 7లో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులను కూడా హైకోర్టు జడ్జీలు కాకుండా తప్పుడు కేసులు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశారని వారు వివరించారు. అలాగే సుప్రీంకోర్టులో ఓ సీనియర్‌ జడ్జిని ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఎలా గేమ్‌ ప్లాన్‌ చేశారో కూడా తెలియచేశారు. చిన్న వయసులో జిల్లా జడ్జిగా ఎన్నికైన ఓ యువ న్యాయవాదిపై కూడా పిటిషన్‌ వేయించి, అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఘటనను కూడా వారు ‘సాక్షి’తో పంచుకున్నారు. 

న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే...
జడ్జీల నియామకం, వారి సమర్థత గురించి చంద్రబాబు చేసినవి అనుచిత వ్యాఖ్యలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బెజ్జారం చంద్రకుమార్‌ అన్నారు. వ్యక్తిగత స్థాయిలో ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలా లేఖలు రాయడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. ఇటువంటి లేఖల వల్ల పలు చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయని, న్యాయవ్యవస్థ స్వతంత్రకు ఇవి ముప్పుగా పరిణమిస్తాయని ఆయన చెప్పారు. న్యాయమూ ర్తుల నియామకాల్లో ముఖ్యమంత్రుల అభిప్రాయా లు కోరితే, వారు తమకు అనుకూలమైన వారినే జడ్జీలుగా నియమించుకోవాలని చూస్తారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement