
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్ల ఓటర్ల జాబితాలో తమ పేర్లు తొలగించారని, దాంతో కౌన్సిల్ సభ్యత్వ పదవి కోసం దాఖలు చేసిన నామినేషన్లను స్వీకరించకపోవడం అన్యాయమని దాఖలైన వ్యాజ్యాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బార్ కౌన్సిళ్ల సభ్యత్వ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేస్తే తమ పేర్లను కౌన్సిళ్లు ఓటర్ల జాబితాలో లేవని చెప్పి ప్రాథమిక దశలోనే తిరస్కరించడం చెల్లదని రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు న్యాయవాదులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ గురువారం విచారించి బార్ కౌన్సిల్ నిర్ణయానికి వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. తాము 2010 నుంచి న్యాయవాదులుగా పనిచేస్తున్నామని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్ష ఉత్తీర్ణత సాధించలేదని చెప్పి తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చి తీరాలనే నిబంధన ఏమీ లేదన్నారు. దీనిపై బార్ కౌన్సిళ్ల న్యాయవాది.. పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రొవిజినల్ సర్టిఫికెట్ కచ్చితంగా అవసరమని, బార్ కౌన్సిళ్ల నిబంధన మేరకే వారి నామినేషన్లను తిరస్కరించామని, పిటిషనర్లు పోటీకి అనర్హులని వాదించారు.
వాదనల అనంతరం బార్ కౌన్సిళ్లు పిటిషనర్ల నామినేషన్లు స్వీకరించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. రెండు బార్ కౌన్సిళ్లు తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు జూన్ 29న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 26తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment