అనర్హుల దరఖాస్తులను ఎందుకు తిరస్కరించలేదు
⇒ మీరిచ్చిన మార్గదర్శకాలను మీరే ఉల్లంఘిస్తే ఎలా?
⇒ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో అనర్హుల దరఖాస్తులను ఎందుకు తిరస్కరించలేదని హైకోర్టు ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఓటర్ల నమోదుకు మీరిచ్చిన మార్గదర్శకాలను మీరే పాటించపోతే ఎలా? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల తోపాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేలా ఆదేశించాలని కోరుతూ అనంతపురానికి చెందిన సీపీఐ (మార్క్సిస్ట్) నేత, రాయలసీమ డెవలప్‌మెంట్ కమిటీ కన్వీనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. ఒకరి డిగ్రీతో మరొకరు దరఖాస్తు చేసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది సత్యప్రసాద్ నివేదించారు. ఈసీ జారీ చేసిన మార్గదర్శ కాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం...ఈసీ మార్గదర్శకా లకు ఉల్లంఘిస్తూ ఇచ్చిన దరఖాస్తులను ఎందుకు అంగీకరించారని ఈసీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. వీటిపై వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని ఈసీ తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో అనుమతిం చిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.