సాక్షి, హైదరాబాద్: యాదవరెడ్డి, భూపతిరెడ్డిలపై అనర్హత వేటుతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు. యాదవరెడ్డికి సంబంధించిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 15వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవద్దని హైకోర్టు గురువారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. భూపతిరెడ్డి స్థానానికి సైతం ఈ నెల 15వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయ బోమని ఎన్నికల సంఘం హైకోర్టుకు హామీ ఇచ్చింది. యాదవరెడ్డి, భూపతిరెడ్డిల అనర్హత వేటుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుం చాలని శాసనమండలి కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లోని 8వ పేరా రాజ్యాంగబద్ధతను తేలుస్తామని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏ హైకోర్టుగానీ, సుప్రీంకోర్టు గానీ స్పీకర్ లేదా మండలి చైర్మ న్ అధికారాలకు సంబంధించిన 8వ పేరా రాజ్యాంగబద్ధతను తేల్చలేదంది.
ఈ విషయానికి సంబంధించి పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదు పరి విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ జారీ చేసిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపతిరెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరో సారి విచారణ జరిపింది.
దానికే అనర్హత వేటు వేస్తారా?
ఈ సందర్భంగా యాదవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ కాంగ్రెస్ పార్టీలో చేరారనేందుకు నిర్ద్ధిష్టమైన ఆధారాలు లేవని, ఈ విషయాన్ని పట్టించుకోకుండానే మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారని నివేదించారు. మేడ్చల్ సభలో సోనియాగాంధీని కలిసినందుకే అనర్హత వేటు వేశారన్నారు. పార్టీ ఫిరాయించడం వేరని, ఓ జాతీయ నేతను కలవడం వేరని, ఈ తేడాను మండలి చైర్మన్ గుర్తించలేకపోయారన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, పార్టీలో చేరారా? లేదా ? అన్నదే ఇక్కడ ముఖ్యమని తెలిపింది. అనర్హత వేటుపై పిటిషనర్ అభ్యంతరాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని మండలి కార్యదర్శిని ఆదేశించింది. దీనికి ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ, యాదవరెడ్డి స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంద ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది మాధురి స్పం దిస్తూ, ఖాళీ అయిన స్థానాలకు 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దీంతో ఈ నెల 15వరకు యాదవరెడ్డి స్థానానికి నోటిఫికేషన్ జారీ చేయవద్దని ఎస్‌ఈసీని కోర్టు ఆదేశించింది.
ఏకపక్ష అధికారాలు సరికాదు...
తరువాత భూపతిరెడ్డి తరఫు న్యాయవాది ఆనంద్ కపూర్ వాదనలు వినిపిస్తూ, 10వ షెడ్యూల్‌లోని 8వ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. 10వ షెడ్యూల్ కింద అటు స్పీకర్‌కు, ఇటు మండలి చైర్మన్‌కు ఏకపక్ష అధికారాలున్నాయని, ఇది ఎంత మాత్రం తగదని తెలిపారు. దీని వల్ల వారు ఇష్టమొచ్చిన రీతిలో నిర్ణయాలు వెలువరిస్తున్నారని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, రాష్ట్రపతికి సైతం ప్రత్యేకాధికారాలు ఉంటా యని, ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని కూడా తప్పుపట్టవచ్చా? అని ప్రశ్నించింది. చట్టాలు చేసే బాధ్యత చట్టసభలదని, ఆ చట్టాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిం చే బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదని కపూర్ చెప్పారు.
శాసనసభ అంటే రెండు సభలు వస్తాయని, ఎవరి అధికారాలు వారివేనని, ఇందులో స్పష్టమైన విభజన రేఖ ఉందని తెలిపారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుతం తమ ముందున్న విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైనా తీర్పునిచ్చిందా? అని ధర్మాసనం ఆరా తీయగా, కపూర్ పలు తీర్పులను ప్రస్తావించారు. కేంద్రం తరఫున ఎన్.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పార్లమెంట్ చట్టాలు చేసిందన్నారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే 10వ షెడ్యూల్ అమల్లోకి వచ్చిందన్నారు. వాదనలు విన్న కోర్టు, 8వ పేరా చట్టబద్ధతను తేలుస్తామంటూ తదుపరి విచారణను 15కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment