
సాక్షి, హైదరాబాద్: సమాజంపై సినిమాల దుష్ప్రభావం చాలా ఉందని, మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తుండడం వల్లే వ్యభిచారానికి డిమాండ్ పెరిగిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వ్యాఖ్యానించారు. సినిమాల ప్రభావంతో 21 ఏళ్ల వయసులోనే యువత పెడదోవ పడుతున్నారని పేర్కొన్నారు. కుటుంబసభ్యులతో కలసి సినిమాలు చూసే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్, ప్రజ్వల, తెలుగు సినీ పరిశ్రమల ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘స్టాప్ డిమాండ్ ఇన్ సెక్స్ ట్రాఫికింగ్’ప్రచారోద్యమం ప్రారంభోత్సవంలో జస్టిస్ కోదండరాం మాట్లాడారు. ఇకముందైనా మంచి సినిమాలు తీయాలని సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీనిపై స్పందించారు. ప్రేక్షకులకు ఆహ్లాదం పంచాలనే లక్ష్యంతో సినిమాలు తీస్తున్నామని, కుటుంబసభ్యులతో కలసి చూడదగిన రీతిలోనే సినిమాలు తీస్తున్నామని పేర్కొన్నారు.
సమాజంలో చైతన్యం తేవాలి..
మహిళల అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా పేర్కొన్నారు. అమెరికాలో మహిళల అక్రమ రవాణా నిరోధానికి అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని తెలిపారు. సమాజంలో చైతన్యం తేవడం ద్వారా వ్యభిచారానికి డిమాండ్ తగ్గి.. మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కనుమరుగవుతాయని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి నెలా సగటున 60 మంది మహిళలను వ్యభిచార కూపాల నుంచి రక్షిస్తున్నామని చెప్పారు. కాగా.. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారికి మంచి సమాజాన్ని ఇవ్వాలన్నదే తన తాపత్రయమని సినీ నటుడు మంచు విష్ణు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు కేంద్రం త్వరలో కొత్త చట్టం తీసుకురానుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళల అక్రమ రవాణా, వ్యభిచారానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సునీతా కృష్ణన్‌ను జస్టిస్ ఎస్‌వీ భట్, జస్టిస్ నవీన్‌రావు, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, అక్కినేని అమల, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment