మీ టర్నోవర్ ఎంతో చెప్పండి
⇒ ఎన్వియన్ ఇంజనీర్స్‌కు స్పష్టం చేసిన హైకోర్టు
⇒ అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామన్న ఎన్వియన్
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై పిటిషన్ దాఖలు చేసిన చెన్నైకి చెందిన ఎన్వియన్ ఇంజనీర్స్ సంస్థ వార్షిక టర్నోవర్ వివరాలను ఉమ్మడి హైకోర్టు కోరింది. గత ఐదేళ్ల టర్నోవర్ వివరాలను తమ ముందుంచాలంది. అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధి బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే సత్తా ఉందో లేదో కూడా చెప్పాలని ఆదేశించింది. ఈ విషయాల్లో తమకు సంతృప్తి కలిగిం చాలని, ఆ తరువాతే మిగిలిన విషయాల్లోకి వెళతామంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అది స్విస్ చాలెంజ్ విధానం కాదు
రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కోసం స్విస్ చాలెంజ్ విధానం కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ జారీ చేసిన జీవో 170కి సవరణలు చేస్తూ ఈ ఏడాది జనవరి 2న ప్రభుత్వం జీవో 1ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఎన్వియన్ ఇంజనీర్స్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుం డగా, న్యాయ మూర్తి జోక్యం చేసుకున్నారు.
స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో పాలు పంచుకునే విషయంలో మీరెంత (ఎన్వియన్) సీరియస్‌గా ఉన్నారు? పాల్గొనేంత సమర్థత మీకుందా? అని ప్రశ్నించారు. ప్రకాశ్‌రెడ్డి సమాధానమిస్తూ... తాము ప్రభుత్వం రూపొందించిన అర్హత నిబంధనలనే సవాలు చేస్తున్నామన్నారు. ప్రధాన ప్రతిపాదకుడిగా (ఓపీపీ) సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు ఏదైనా కంపెనీ పోటీగా బిడ్ సమర్పించి హయ్యస్ట్ బిడ్డర్‌గా నిలిస్తే, ఓపీపీ తన ప్రతిపాదనలను సవరించే అవకాశం ఉంటుందని, అదే అవకాశం హయ్యస్ట్ బిడ్డర్‌కు ఉందని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చేందుకేనని, ఇలాంటి నిబంధనలు స్విస్ చాలెంజ్‌లో ఇంకా ఉన్నాయన్నారు.
అందుకే తాము ఓపెన్ టెండర్ విధానం అమలుకు కోరుతున్నామని వివరించారు. స్విస్ చాలెంజ్‌లో ఓపీపీ ఎటువంటి చర్చలు, అభ్యర్థనలు లేకుండా సుమోటో ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుం దన్నారు. ఇక్కడ సింగపూర్ కన్సార్టియం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సింగపూర్ కన్సార్టియంతో పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపిందన్నారు. ఇందుకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్‌నోటే సాక్ష్యమని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కోర్టు కోరిన వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు.