ఎక్కడైనా డెవలపర్లదే పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రభుత్వం మరో దోపిడీకి తెర లేపిందని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు లాలూచీ పడ్డారని.. మన భూమి, నిదులు ఇచ్చి మరీ వాళ్లకు దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం చేసుకుంటున్న వైనంపై ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ దోపిడీని అడ్డుకునేవారందరినీ అభివృద్ధి నిరోధకులని అంటున్నారని ఆయన విమర్శించారు. సాధారణంగా భూములు ఎవరిచ్చినా డెవలపర్లే పెట్టుబడి పెడతారని, మనం వ్యక్తిగత స్థాయిలో మనకున్న భూమిని అపార్టుమెంట్లుగా కట్టడానికి డెవలప్‌మెంట్‌కు ఇచ్చినా నిధులు వాళ్లే సమకూర్చి పనులన్నీ చేసిన తర్వాత మన వాటా మనకు ఇస్తారని ఆయన చెప్పారు.
కానీ సింగపూర్ కంపెనీల విషయంలో మాత్రం ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, మకీ కంపెనీ చైర్మన్ కూడా అదే విషయం చెప్పారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శకత లేదని, అంతా గోప్యమని, రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆయన సుదీర్ఘంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అంతర్జాతీయ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పదని, చంద్రబాబు తన తాబేదారులకు అప్పనంగా దోచిపెడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే సింగపూర్ కంపెనీలపై విచారణ జరిపించాలని, ప్రభుత్వం లాలూచీ పడిందన్న విషయాన్ని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అవినీతి విషయంలో ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.