మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక సీఆర్‌డీఏకే | Master developer choice to CRDA itself | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక సీఆర్‌డీఏకే

Published Tue, Jan 3 2017 3:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Master developer choice to CRDA itself

స్విస్‌ చాలెంజ్‌ నిబంధనలు మార్చిన ఏపీ ప్రభుత్వం.. జీవో విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో 1,691 ఎకరాల స్టార్టప్‌ ఏరియా అభివద్ధికి మాస్టర్‌ డెవలపర్‌ను ఎంపిక చేసే బాధ్యతను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏకే కట్టబెట్టింది. ఈ మేరకు సోమవారం జీవో నెంబరు ఒకటి విడుదల చేసింది. సింగపూర్‌ కంపెనీలతో లాలూచీపడి వారి కన్సార్టియంకు ప్రాజెక్టును అప్పగించేందుకు ప్రయత్నించి భంగపడి చివరికి ఏపీఐఈడీ చట్టాన్నే మార్చేసిన ఏపీ ప్రభుత్వం.. అందుకనుగుణంగా తాజాగా టెండరు నిబంధనల్లో మార్పులు చేసింది. సీఆర్‌డీఏ ఏర్పాటు చేసే టెక్నికల్‌ కమిటీకే మాస్టర్‌ డెవలపర్‌ను ఎంపిక చేసే అవకాశాన్ని  కల్పించింది. ఎక్కువ ఆదాయాన్ని తీసుకురావడమే టెండర్‌ లక్ష్యమని నిబంధనల్లో పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువను ప్రకటించి అంతకంటె తక్కువకు టెండరు వేసేందుకు ఎవరు ముందుకొస్తే వారికి కేటాయించాల్సివుంటుంది. కానీ గతంలో ఇందుకు విరుద్ధంగా మాస్టర్‌ డెవలపర్‌ ఎంత కోట్‌ చేశారనే విషయాన్ని బయటకు చెప్పేవారు కాదు. సవరించిన నిబంధనల ప్రకారం మొదట ప్రతిపాదన చేసిన కంపెనీ కోట్‌ చేసిన విలువను వెల్లడించవచ్చు. దీన్ని సీఆర్‌డీఏ టెక్నికల్‌ కమిటీ ఆమోదిస్తే సరిపోతుంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏపీఐఈడీ చట్టం కింద చర్చించి ప్రాజెక్టును కంపెనీలకు కేటాయించేవారు.

తాజా ఉత్వర్వుల ప్రకారం ఏపీఐఈడీ కాకుండా సీఆర్‌డీఏనే మాస్టర్‌ డెవలపర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడింది. గతంలో విడుదల చేసిన స్విస్‌ ఛాలెంజ్‌ టెండరు నిబంధనలన్నీ సింగపూర్‌ కన్సార్టియంకు అనుకూలంగా రూపొందించడంతో ఆదిత్య ఇన్‌ఫ్రా తదితర కంపెనీలు హైకోర్టు కెళ్లడం, కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీంతో ఏపీఐఈడీ చట్టాన్నే ప్రభుత్వం మార్చేసింది. టెండరు వెనక్కు తీసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాలతో సవరణలు చేస్తున్నట్లు తాజా జీవోలో పేర్కొంది. టెండరుదారుడు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇవ్వాల్సివుంటుందనే అంశాన్ని జోడించింది. మార్చిన నిబంధనల ప్రకారం మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక కోసం సీఆర్‌డీఏ త్వరలో స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో టెండరు పిలవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement