దర్యాప్తునకు ఆదేశించండి
హైకోర్టులో ఆల్విన్ వాచెస్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఎస్‌బీహెచ్, ఇతర బ్యాంకుల్లో లిక్విడేషన్ (మూసివేత) కంపెనీల నిధుల మళ్లింపునకు సంబంధించి అధికార లిక్విడేటర్ (ఓఎల్) కార్యాలయ సిబ్బంది ప్రమేయంపై అనుమానం ఉంటే సమగ్ర వివరాలతో సీబీఐకి ఫిర్యాదు చేయాలని హైకోర్టు సోమవారం ఆల్విన్ వాచెస్ లిమిటెడ్ ఓఎల్‌ను ఆదేశించింది. ఓఎల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదుకు తిరస్కరించడానికి వీల్లేదని సీబీఐకి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌బీహెచ్‌లో తమ కంపెనీకి చెందిన రూ.9 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆల్విన్ వాచెస్ ఓఎల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సీబీఐకి ఫిర్యాదు చేయాలని రెండు రోజుల క్రితం ఆదేశించారు. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు రాగా, ఓఎల్ ఇచ్చిన ఫిర్యాదు సరిగా లేదని, సరైన వివరాలతో ఫిర్యాదు ఇచ్చి దర్యాప్తునకు అభ్యర్థించాలని ఓఎల్ తరఫు న్యాయవాదికి న్యాయమూర్తి సూచించారు.
రూ.9 కోట్ల నిధులు మళ్లాయి
Published Tue, Dec 8 2015 4:21 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement