హెచ్‌సీఏ ఎన్నికలకు పచ్చ జెండా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణకు కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అసోసియేషన్ కార్యదర్శి జాన్ మనోజ్ హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం బుధవారం విచారణ జరిపారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎన్నికలను యథాతథంగా జరుపుకోవచ్చన్నారు. ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశిస్తూ.. విచారణను 18కి వాయిదా వేశారు. అధ్యక్ష పదవికి భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పోటీ పడుతుండటంతో ఒక్కసారిగా హెచ్‌సీఏ ఎన్నికలు ఆసక్తిని పెంచాయి.