దయగల హృదయమేదయా?
పద్యానవనం: ఫలములిచ్చెడు పాదపప్రతతి గనియు
పాలు గురిసెడు గోసమూహాల గనియు
కరిగి వర్షించు నీలిమేఘాల గనియు
కనికరము నేర్చుకొనని ముష్కరుడు నరుడు
సకల జీవుల్లో మనిషి ఉత్కృష్టమైన ప్రాణి అంటారు. మేధస్సు కలిగి ఆలోచనతో నడుచుకునే జీవి మనిషి. కానీ, ఇతర జీవుల పట్ల, జీవవైవిధ్యం పట్ల, ప్రకృతి సమతుల్యత పట్ల, మొత్తానికి ప్రకృతి పట్ల స్పృహ నానాటికి సన్నగిల్లుతోంది. ప్రకృతిని కాపాడుకోవాలని, అలక్ష్యం చేస్తే భవిష్యత్తరాల మనుగడ ప్రశ్నార్థకమౌతుందన్న మౌలికాంశాన్నే మనిషి విస్మరిస్తున్నాడు.
ప్రకృతికి తద్వారా మొత్తం భూమండలానికే ముంచుకు వస్తున్న ముప్పు పట్ల, సమాజహితంలో ఆలోచించే వారు, పర్యావరణ ప్రేమికులు ఇటీవలి రెండు సందర్భాల్లో తమ ఆందోళనల్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న ధరిత్రీ దినం, రెండోది జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ఈ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మనిషి పాత్ర-ప్రమేయం వల్లే ప్రకృతి సమతుల్యత చెడి ఈ ధరిత్రికి ప్రమాదమేర్పడుతోంది. దీనికి విరుగుడుగా... ఏదో చేయాలి! పూని ఏదో ఒకటి చేయకుంటే, ప్రమాదం అత్యంత వేగంగా ముంచుకు వస్తోందన్నది ఆందరూ అంగీకరించే సత్యం. ప్రపంచమంతా కూడబలుక్కొని ఏదేదో చేసేయడం ఉన్నపళంగా సాధ్యపడదు. దేశాలు దేశాలుగా శ్రద్ధ వహించి కృషి చేయాలి. అంతకు మించి, ఎవరికి వారు, తమ తమ స్థాయిలో చేయగలిగినంత మేరకు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చిన్న చిన్న చర్యలతోనైనా చొరవ చూపాలన్నది ఐక్యరాజ్య సమితి పిలుపు. ఇటువంటి పూనికకు ముందు, ప్రతి మనిషిలో ఎంతో కొంత కనికరం, దయ, అనుకంప అనేవి ఉండాలి, ఉండి తీరాలనేది ప్రకృతి సూత్రం. కానీ, ఎందుకో మనిషి రోజు రోజుకు కనికరం నశించి కటువుగా తయారవుతున్నాడు.
పరిస్థితుల ప్రాబల్యమా? మనిషి మనిషికి మధ్య అంతరం పెరిగి మానవత్వం మృగ్యమవడమా? కష్టపడకుండా అవకాశాలు లభించని ఈ సంక్లిష్ట వ్యవస్థలో, శ్రమపడకుండా అవతలి వాళ్ల అవకాశాల్ని తానే తన్నుకుపోవాలనే దుర్బుద్ధా? అన్నీ తనకే కావాలనే అవధులు మించిన స్వార్థమా? కారణమేదైనా కావచ్చు, మనిషనేవాడు మాత్రం కనుమరుగవుతున్నాడు. మానవేతిహాసం మొదలయిన్నుంచి మనిషి తనకన్నా పూర్వం నుండి ఉన్న వాటిని అనుసరిస్తూనో, అనుకరిస్తూనో (మ్యుటేషన్ ఆర్ ఇమిటేషన్) ముందుకు సాగుతున్నాడు. ఎడనెడ తన సృజనతో కొత్త కొత్త విషయాల్ని కనుగొంటూ సాధించే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేస్తూ పురోగమిస్తున్నాడు. అంతిమ లక్ష్యం ఆనందం పొందడం. సర్వేజనాః సుఖినోభవంతు! మరి, మంచి నేర్చుకోవడానికి, తనలో అప్పటికే ఉన్న మంచిని కాపాడుకోడానికి ఉన్న అవరోధమేంటో అర్థం కాదు.
పారశీక తాత్వికుడు, కవి ఉమర్ ఖయ్యామ్‌ను తెనుగించిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ పద్యంలో అదే చెబుతున్నాడు. రాయితో కొట్టేవాడికి కూడా తియ్యటి ఫలాలనిచ్చే చెట్టు నుంచి స్ఫూర్తి పొందవచ్చు. తన బిడ్డకు అవసరమయ్యే ఆహారంకన్నా ఎన్నోరెట్లు అధికంగా పాల రూపంలో సంపూర్ణ ఆహారాన్ని మానవ మనుగడ కోసం అందిస్తున్న గోమాత నుంచీ అటువంటి స్ఫూర్తి లభిస్తూనే ఉంది. తాము నిలువెల్లా కరిగిపోతూ కూడా నిరతం వర్షించి నేలను సశ్యశ్యామలం చేసే నీలి మేఘాలూ స్ఫూర్తి దాతలే! ఇవన్నీ చూస్తూ కూడా, అవిచ్చే ఫలాలు అనుభవిస్తూ కూడా మనిషి కనికరం, దయ, అనుకంప నేర్చుకోడు. అలా నేర్వనివాడు నరుడు కాడు ముష్కరుడన్నది పెద్దల భావన. కృష్ణుడు ఉజ్జయినిలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసేటప్పటి బాల్యమిత్రుడు సుధాముడు. తర్వాత ఆయన తన స్వస్థలం మధురలో ఉంటాడు. చాలా సంవత్సరాల తర్వాత... తొలిసారి కృష్ణుడు మధురకు వస్తున్నాడని తెలిసి సంబరపడిపోతాడాయన. కానీ, పేదవాడైన తాను మితృడికేమివ్వగలనని మధనపడి, కడకు తనకు చేతనైన విద్య, వృత్తి, ప్రవృత్తి మాలలల్లడమే కనుక, ఓ మంచి దండ తయారు చేస్తాడు.
అది వేయగానే పులకించిపోయిన కృష్ణుడు ఏదైనా కోరుకొమ్మని మిత్రుడినడుగుతాడు. అప్పుడు సుధాముడు, ‘‘నీపాద కమల సేవయు, నీపాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూతదయయును, తాపస మందార నాకు దయజేయగదే!’’ అంటాడు. ఒకటి తన కోసం, భగవంతుని సేవకుడిగా అనుగ్రహించమంటాడు. రెండు, తన చుట్టూ ఉన్న వారి కోసం, తన స్నేహమల్లా భగవత్భక్తి కలిగిన సజ్జనులతోనే సాగేట్టు చేయమంటాడు. ఇక మూడోది, సమస్త జీవ కోటి కోసం, సకల జీవుల పట్లా తనకు అపారమైన అవ్యాజమైన ప్రేమ, దయ, అనుకంప కలిగి ఉండేలా వరమీయమంటాడు మితృడైన భగవంతుడిని. ఎంత గొప్ప సద్భావన! ఈ సూర్యమండంలోని ఇతర ఏ గ్రహాలపైనా లేని జీవం కలిగి ఉన్న మన పృథ్విని కాపాడుకోవడానికి మనందరిలోనూ ఉండాల్సింది ఈ సద్భావనే!
- దిలీప్‌రెడ్డి