
పర్యావరణంపై నిర్లక్ష్యం శోచనీయం: జైపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వా లు, ఆర్థిక వేత్తలు, రాజకీయ నాయకులు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయమని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ ముప్పు అణుబాంబు కన్నా ప్రమాదకరమన్నారు. స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ జూబ్లీహాలులో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆచార్య కె. పురుషోత్తమ రెడ్డి, డాక్టర్ కె. తులసీరావుకు మంత్రి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, పారిశ్రామిక విప్లవమే పర్యావరణానికి ముప్పు తెచ్చిందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు.
నీటి కాలుష్యం వల్ల రోజూ మన దేశంలో 580 మంది, ప్రపంచవ్యాప్తంగా 14 వేల మంది చనిపోతున్నారని చెప్పారు. కొన్ని పంటలు అంతరించిపోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ భూకబ్జాలను అరికట్టాలని, భూగర్భ జలాలను పరిరక్షించాలన్నారు. ఈ దిశగా స్వచ్ఛంద సంస్థలు కృషి చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మూడేళ్ళుగా కార్యక్రమాలు నిర్వహించామని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ అధ్యక్షులు లీలా లక్ష్మారెడ్డి తెలిపా రు. పర్యావరణ పరిరక్షణ దిశగా తాము చేస్తున్న న్యాయపోరాటానికి తగిన తోడ్పాటు లభించడం లేదని జీవిత సాఫల్య పురస్కా రం గ్రహీత పురుషోత్తమరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల తీర్పులను పాలకులు అమలు చేయకపోవడం ప్రమాద కరమన్నారు. పర్యావరణ పార్కుకు గచ్చిబౌలిలో ప్రభుత్వం కేవలం 5 ఎకరాల స్థలం కేటాయించడాన్ని గ్రీన్‌లీడర్ అవార్డు గ్రహీత తులసీరావు తప్పుపట్టారు. పార్కు చుట్టుపక్కల స్థలం ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, హైదరాబాద్‌లో పర్యావరణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.
‘అప్పట్లో చిన్నపాటి రౌడీని!’
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తనను తాను రౌడీగా చెప్పుకున్నారు. కాకపోతే అది విద్యార్థి దశలో అని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహాల్‌లో జరిగిన పర్యావరణ అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడుతూ.. ‘ఏదైనా 18 ఏళ్ళలోపే నేర్చుకోవాలి. ఆ తర్వాత అసలు వీలుకాదు. నా విషయాన్నే చూడండి. కాలేజీలో చదివేటప్పుడు అంతా టైపింగ్ నేర్చుకోమని చెప్పారు. వింటేనా? వినలేదు! ఎందుకంటే.. అప్పట్లో మనం చిన్నపాటి రౌడీ.. (కాస్త సవరించుకుని) విద్యార్థి నాయకులం కదా! ఆ దెబ్బతో టైపింగ్ అబ్బలేదు.’ అని వివరించారు.