మైటీ గర్ల్
ఆడపిల్లంటే.. ఒక జన్మకు సరిపడా కష్టాలు, కన్నీళ్ల కలబోత. తరతరాలుగా కథలు, కవితలు, పాటలు... అన్నింటా అదే వ్యథ. ఇలా ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు?.. ఇండియాస్ డాటర్స్ మైటీ గాళ్స్‌గా మారాలంటోంది ‘ఎ మైటీ గాళ్’. ‘మన వీరోచిత ఇతివృత్తాలను రాసుకుందాం మనమే కథానాయికలమవుతూ! మన ఆడబిడ్డలకు ఆ కథల్నే చెబుదాం ఇకనుంచైనా!’ అంటూ ఎలుగెత్తుతోంది. ఇదీ ఆడపిల్లల కొత్త కథ ఇతివృత్తం!. ఇంతకీ ఎవరీ మైటీ గాళ్? ఆమె వెనుక ఎవరున్నారు?..
.:: శరాది
అనగనగా ఆడపిల్ల.. కష్టాలన్నీ చుట్టుముడతాయి. కన్నీళ్లు దిగమింగుకుని.. దేవుడిపై భారం వేయడమో.. లేక తీర్చేవాళ్లెవరో ఉంటారు.. వస్తారనే భరోసాతో జీవితాన్ని వెళ్లదీయడమో చేస్తుంది. అంతేతప్ప తెగువ చూపించే స్వతంత్ర వ్యక్తిగా కనిపించదు... దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా (ఆయా నేపథ్యాలకనుగుణంగా పాత్రల పేర్ల మార్పుతో) దాదాపు ప్రతి ఆడపిల్లా ఇలాంటి ‘బేల’ కథలనే వింటూ పెరుగుతుంది. ఇకపై అలాంటి కథలకు ఇక కాలం చెల్లింది. ‘above all, be the heroine in your life, not the victim' అని ఉద్బోధ చేయాలనుకుంటోంది ‘ఎ మైటీ గాళ్’. అసలు దీని కథేంటో తెలుసుకుందాం...
ఇదీ నేపథ్యం..
కెరోలిన్ డాంకెర్ట్, ఆరన్ స్మిత్.. భార్యాభర్తలు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసేది కెరోలిన్. వాళ్ల అక్కచెల్లెళ్ల పిల్లల బర్త్‌డేలు వచ్చినప్పుడు ఆ పిల్లలకు గిఫ్ట్స్‌గా బుక్స్‌నివ్వడం ఆమెకు ఇష్టం, అలవాటు కూడా. ఓసారి ఒకమ్మాయి పుట్టినరోజుకి పుస్తకమివ్వాలని వెదుకుతున్నారు. ఎంతసేపూ అమ్మాయిలను బేలగా చూపించే కథల పుస్తకాలే తప్ప వాళ్ల శక్తియుక్తులను చూపించే ఒక్క పుస్తకమూ కనపడలేదు.
పోనీ బయోగ్రఫీస్ చూద్దామన్నా.. అబ్రహంలింకన్, బెంజిమన్ ఫ్రాంక్లిన్, ఐన్‌స్టీన్, చాప్లిన్.. ఇవే తప్ప స్త్రీలకు సంబంధించినవి వేళ్లపై లెక్కపట్టగలిగినన్నే కనిపించాయి. సరే అప్పటికి ఆ అమ్మాయికి ఏదో పుస్తకం కొని కానుకగా ఇచ్చినా... ఆ జంట మనసులో మాత్రం ఆ వెలితి ఉండిపోయింది. సర్దుకుపోయే మనస్తత్వాన్ని చిత్రించే అమ్మాయి కథలే తప్ప ఓ సమస్యను పరిష్కరించుకునే, సాహసాన్ని ప్రదర్శించే కథలే లేవేంటి? అన్న ఆలోచన వాళ్లను తొలిచేసింది.
మౌఖిక, లిఖిత సాహిత్యాల్లోనూ అదే లోటు. ఒక్క అమెరికాలోనే ఇలాంటి పరిస్థితి ఉందా? అనుకుని.. యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల సాహిత్యాన్నీ పరిశీలించారు. అక్కడా అంతే. ఏ దేశంలోనైనా స్త్రీల పరిస్థితి ఒకేరకంగా ఉండానికి గల కారణమూ అర్థమైంది. వ్యక్తిత్వ వికాసంలో సాహిత్యానిది ప్రధాన పాత్ర. సాహసాలు, పరిశోధనలు, ప్రతిభా పాటవాలను చూపించే భూమికలన్నీ మగవాళ్లవే. అలాకాక స్త్రీ కథానాయికగా.. అంటే ఓ సాహసనారిగా, చతురత కలిగిన మూర్తిగా, పరిశోధనా స్ఫూర్తిగా సాగిపోయే కథల అన్వేషణ మొదలుపెట్టి అలాంటి వాటన్నిటినీ పోగుచేసి ఓ వెబ్‌సైట్‌లో పెట్టాలనుకున్నారు. అలా కొన్ని నెలల శ్రమ తర్వాత ‘ఎ మైటీ గాళ్’ వచ్చింది. సంస్థగా, వెబ్‌సైట్‌గా, ఫేస్‌బుక్ పేజ్‌గా కూడా!
కథానాయికల కథల కోసం..
దంపతులిద్దరూ ప్రపంచంలోని ప్రతి దేశానికి వెళ్లి.. అక్కడి పాఠశాలలను, కళాశాలలను, సాంస్కృతిక సంస్థలను, ప్రచురణ సంస్థలను సంప్రదించి, తాము చేస్తున్న పనిని వివరిస్తారు. ఆయా దేశాల్లో స్త్రీలను కథానాయికలుగా చూపించే కథలు ఏమున్నాయో తెలుసుకుంటారు. ఆడపిల్లలను హీరోయిగ్గా చూపించే పుస్తకాలనే కాక స్త్రీలు రాసిన పుస్తకాలనూ పోగు చేస్తున్నారు.
పబ్లిషింగ్ హౌసెస్‌నూ కలుస్తున్నారు. ఇలా నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన రెండు వేల పైచిలుకు పుస్తకాలను తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. భిన్న అభిరుచి ఉన్న వాళ్లు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకోవడానికి, అలాంటి పుస్తకాలనూ షేర్ చేసుకోవడానికి బుక్ క్లబ్‌నూ నిర్వహిస్తోందీ సంస్థ. ప్రపంచంలోని అమ్మాయిలంతా ఇందులో లాగిన్ అయి సభ్యత్వం తీసుకోవచ్చు.
ఎన్నెన్నో బుక్స్.. గైడ్స్
బయోగ్రఫీస్, యాక్షన్, అడ్వంచర్, క్లాసిక్స్, జానపద గాథలు, గ్రాఫిక్ నావల్స్, హాస్య ప్రధానమైనవి, మిస్టరీ, ఫిక్షన్, మల్టీకల్చరల్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, రియలిస్టిక్ ఫిక్షన్, పిక్చర్ బుక్స్ ఇలా రకరకాల పుస్తకాలుంటాయి. అంతేకాదు.. అమ్మాయికి సూచనలు, ఆరోగ్య సలహాలు, ఆత్మరక్షణ చిట్కాలు, ఎవరైనా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్లకి ఎలాంటి కౌంటర్లు ఇవ్వాలి, సమస్యలను డీల్ చేసే విధానాలతో ‘ఎ స్మార్ట్ గాళ్స్ గైడ్’ కూడా ఇందులో ఉంటుంది. అయితే ఎ మైటీ గాళ్‌లో కేవలం ఆడపిల్లలే కాకుండా అడల్ట్ విమెనూ చదువుకోదగ్గ పుస్తకాలూ ఉంటాయి.
సినిమాలు, సంగీతం, బొమ్మలు..
ఒక్క పుస్తకాలే కాక, అమ్మాయిలకు సంబంధించిన సంగీతం, సినిమాలూ ఇందులో ఉంటాయి. ఎంతసేపూ వంటింటి పావులు, బొమ్మల పెళ్లి ఆటలాడి పెద్దయ్యాక పాత్రల్లో జీవించి అలసిపోకుండా కొత్త బొమ్మల్నీ పరిచయం చేస్తోందీ వెబ్‌సైట్. అమ్మాయిలు పర్వతారోహణ చేస్తున్నట్టు, సర్ఫింగ్, బంగీజంప్‌లు, వ్యోమగాములుగా, సైటింస్ట్‌లుగా ల్యాబ్స్‌లో, డాక్టర్స్‌గా.. ఇట్లాంటి బొమ్మలన్నీ ఇందులో ఉంటాయి. ఆడపిల్లలకు స్ఫూర్తినిచ్చేవిగా.
మైటీ కాన్సెప్ట్‌తో సిటీకొచ్చాం!
ప్రపంచమంతా తిరుగుతూ రెండు రోజుల కిందటే హైదరాబాద్ చేరుకున్నాం. అమెరికన్ కాన్సులేట్ సహకారంతో ఇక్కడున్న స్కూళ్లు, పబ్లిషింగ్ హౌసెస్‌తో భేటీ అయ్యాం. ఇక్కడి వ్యవస్థలో స్త్రీలకున్న స్థానాన్ని బట్టి చూస్తే ఎ మైటీ గాళ్ సేవల ఆవశ్యకత ఎక్కువే అనిపిస్తోంది. ఇక్కడున్న అక్షరాస్యత, పిల్లల డ్రాపవుట్స్, మిడిల్, లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల్లో చాలామంది అక్షరాస్యులు కాకపోవడం ఎట్‌సెట్రా.. మాకు సవాళ్లే. అయినా మేం వెళ్లిన స్కూళ్లు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నాయి.
అసలు ఇండియా నుంచి మా వెబ్‌సైట్‌లో అప్‌లోడైన పుస్తకాలే మేం ఇక్కడికి రావడానికి ప్రేరణ. హైదరాబాద్ నుంచీ వచ్చాయి. పూర్ ఎకనామికల్ అండ్ సోషల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి మలావత్ పూర్ణ అనే అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ప్రయత్నాన్ని, సాహసాన్ని కథగా పంపారు. రియల్లీ వండర్‌ఫుల్ స్టోరీ. తమిళనాడు, రాజస్థాన్‌లాంటి చోట్ల నుంచీ చాలా కథలు, బయోగ్రఫీస్ అప్‌లోడ్ అయ్యాయి. ఇవన్నీ మంచి బొమ్మలు, గ్రాఫిక్స్‌తో వస్తున్నాయి. మేం స్కూల్లో విద్యార్థినులకే కాక టీచర్స్‌కీ, పేరెంట్స్‌కీ ఇలాంటి స్టోరీస్ గురించి చెప్తాం. ఏ దేశంలోనైనా ఆడపిల్లలంటే కొంచెం అటుఇటుగా ఒకటే! కాబట్టి ఈ కథలు వాళ్లకు ఒక ఎడ్యుకేషన్. మైటీ కాన్సెప్ట్‌తో ఆడపిల్లల్లో స్వావలంబన, సాధికారత సాధించడమే మా లక్ష్యం. - కెరోలిన్ డాంకెర్ట్, ఆరన్ స్మిత్