నమో ఆరోగ్య దీపావళి | Be Careful With Fireworks On Diwali Festival Day | Sakshi
Sakshi News home page

నమో ఆరోగ్య దీపావళి

Published Sat, Oct 26 2019 1:49 AM | Last Updated on Sat, Oct 26 2019 1:49 AM

Be Careful With Fireworks On Diwali Festival Day - Sakshi

ధర్మశాస్త్రాలలో చెప్పిన దీపావళికి ఇప్పటి దీపావళికి సంబంధం లేదు. ఈనాటి పండుగ ధన వ్యయానికి, ప్రాణప్రమాదాలు, గాయాలకు కారణమౌతోంది. అసలైన దీపావళిని శారీరక మానసిక ఆరోగ్యాల కోసం మన ఋషులు ఏర్పరిచారు. చలికాలంలో పర్యావరణ పరిరక్షణ, వ్యాధి నిర్మూలన ఈ పండుగ నిర్దేశిత లక్ష్యాలు. చలితో మంచుతో వాతావరణంలో, ఉష్ణోగ్రతలో మార్పులను తట్టుకొనే విధంగా నువ్వుల నూనెతో అసంఖ్యాకంగా దీపాలను వెలిగించటమే దీపావళి.

ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతల సమ్మేళనంగా ఏర్పడిన దీపావళి పండుగ భారతీయ పర్వదినాలలో ప్రధానమైనది. పౌరాణికంగా ఈ పండుగ ద్వాపర యుగంలో సత్యభామాశ్రీకృష్ణులు నరకాసురుని సంహరించిన సందర్భంగా ఏర్పడింది. పదహారు వేలమంది స్త్రీలను చెరపట్టిన పరమ దుర్మార్గుణ్ని చంపినప్పుడు ప్రజలలో కలిగిన ఆనందానికి ఈ పండుగ సంకేతం అయినప్పటికీ ఇందులోని పరమార్థం వేరే ఉంది.

చలికాలంలో వచ్చే చర్మవ్యాధులకు, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల నివారణకు నువ్వులు, నువ్వులనూనె వాడకం సులభోపాయం. దీపావళి పండుగలోని పరమార్థం కూడా ఇదే! వేదాలు, ఉపనిషత్తులలో, పితృకార్యాలలో ప్రస్తావించబడిన తిలలు (నువ్వులు) ద్వాపర యుగం అనగా అయిదు వేల సంవత్సరాలకు పూర్వం నుండి భారతదేశంలో పండుతున్నాయి. శ్రీకృష్ణావతార కాలానికి – నువ్వుల పంట భౌగోళిక చరిత్రకు... లెక్క సరిపోతుంది.

ఆశ్వయ్యుజ కృష్ణపక్షస్య చతుర్దశ్యాం విధూదయే తిలతైలేన కర్తవ్యం స్నానంనరక భీరుణా   (నిర్ణయ సింధు)
నరక చతుర్దశినాడు తప్పకుండా అందరూ నల్ల నువ్వులతో కలిపి కొట్టిన సున్నిపిండిని నువ్వుల నూనెను తలకు, ఒళ్లంతా పూసుకుని కుంకుడుకాయ రసంతో తలంటి పోసుకోవాలి. అమావాస్యనాడు సాయంకాలం లక్ష్మీదేవి పూజ చేసి నువ్వులనూనెతో   అసంఖ్యాకంగా దీపాలు వెలిగించాలి. అప్పుడు ఉష్ణోగ్రత పెరిగి చలి తగ్గుతుంది. పొలాల్లో, ఇళ్లల్లో బాధించే క్రిమికీటకాలు దీపాల వెలుగుకు ఆకర్షింపబడి దీపాల చుట్టూ తిరుగుతూ చచ్చిపోతాయి. నువ్వులనూనెతో వెలిగే దీపాలకున్న శక్తిని తెలపటానికే దీపావళి పండుగ ఏర్పడింది.

దీపైః నీరాజనాదత్రసైషా దీపావళీ స్మృతా’ (మత్స్యపురాణం)
పిల్లలు, పెద్దలు స్వయంగా తయారుచేసుకునేవన్నీ వెలుగునిచ్చేవే. పేలుడు పదార్థాలకు దీపావళి పండుగకు సంబంధం లేదు. ఆవు పేడ, తాటి పూలు, బొగ్గులతో చుట్టిన పూల పొట్లాలను  వీధిలో నిలబడి గిరగిరా తిప్పితే శారీరక వ్యాయామంగా పౌరుష సూచకంగా పర్యావరణ పరిరక్షణకు పనికివస్తాయి. శబ్దాలు, మిరుమిట్లు గొలిపే కాంతులతో చెవులు, కళ్లు పాడుచేసుకోమని దీపావళి చెప్పలేదు. గోగు పుల్లలకు గుడ్డ చుట్టి నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. దీపావళి నాడు ఉదయం నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి.

నువ్వులనూనెతో చేసిన గారెలు, వడలు వంటి పిండివంటలు, చిమ్మిరి ఉండలు నైవేద్యం పెట్టాలి. నువ్వు తెలగపిండి కూరల్లో కలిపి వండాలి. ఇలా శారీరక ఆరోగ్యానికి అన్నివిధాల లాభదాయకమై... పర్యావరణాన్ని, పంటలను రక్షించటానికి, చలిని పోగొట్టటానికి ఏర్పడింది దీపావళి పండుగ. నరకాసురుని కథ ద్వారా యువతరంలో సత్‌ప్రవర్తనను, తల్లిదండ్రులకు చక్కని పిల్లల పెంపకాన్ని తెలియచేసే కర్తవ్యబోధిని. శాస్త్రీయంగా, నిరాడంబరంగా నిర్భయంగా నిజమైన దీపావళి పండుగను జరుపుకుందాం. దేవ, పితృ, ఋషి ఋణాలు తీర్చుకుందాం.
– డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement