ప్రమాదాలకు దూరంగా... | Be Care0ful With Fireworks On Diwali Festival Day | Sakshi
Sakshi News home page

ప్రమాదాలకు దూరంగా...

Published Sat, Oct 26 2019 5:51 AM | Last Updated on Sat, Oct 26 2019 5:51 AM

Be Care0ful With Fireworks On Diwali Festival Day - Sakshi

ఒకపక్క వానలు బాగా పడ్డాక... మరో పక్క ఈశాన్య రుతుపవనాలు రాబోయే ముందర వచ్చే పండగ దీపావళి. అంటే రెండు వానల సీజన్‌ల మధ్య ఇది వస్తుంది . ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. దాంతో ఇళ్లన్నీ చెమ్మతో నిండి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఇంటికి వెల్ల/సున్నం వేశారనుకోండి. అప్పుడా సున్నం ప్రభావంతో ఇంట్లోని హాని చేసే సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. అంతేకాదు... వెంటనే రాబోయే ఈశాన్య రుతుపవనాల్లోని మరో చెమ్మ కాలంలో సైతం ఈ సున్నం ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనూ ఇల్లు సూక్ష్మ జీవుల నుంచి సురక్షితంగా ఉంటుంది.

ఇక ఈ చెమ్మ సీజన్‌లో వేగంగా పెరిగిపోయే అనేక రకాల హానికారక సూక్ష్మజీవులు నశించిపోయేందుకు బాణాసంచా నుంచి వచ్చే పొగలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే ఈ సీజన్‌లో టపాకాయలు కాలుస్తారు. వాటి నుంచి  వెలువడే గంధకం, పొటాషియం వంటి వివిధ రసాయనాలు కీటకాలను, క్రిములను తుదముట్టించడమే కాదు... వాటి పెరుగుదలను చెమ్మతో నిండిన ఈ సీజన్‌ తగ్గే వరకు అరికడతాయి. అంతేకాదు... ఈ సీజన్‌లో పడ్డ విపరీతమైన వర్షాల వల్ల గుంతల వంటి వేర్వేరు చోట్ల, మనకు తెలియకుండానే వివిధ ప్రాంతాల్లో పెరిగే దోమల వల్ల మలేరియా, డెంగీ విస్తరించాయి. ప్రత్యేకంగా ఈ సీజన్‌లో డెంగీతో పాటు చికన్‌గున్యా జతకట్టి మరింత విజృంభించింది.

వర్షాలు పడ్డప్పుడువచ్చే ఈ సీజన్‌లోని వ్యాధుల నుంచి రక్షించడానికి, వ్యాధికారక క్రిములను తుదముట్టించడానికి ఈ బాణాసంచా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవీ దీపావళి పటాసుల పాటిజవ్‌ అంశాలు. కానీ నాణేనికి మరో వైపు ఉన్నట్లే దీపావళి బాణాసంచాతో మరికొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెవులకు బాణాసంచా శబ్దాలు ఎంతో హాని చేస్తాయి. చెవుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీపావళి మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

గట్టి శబ్దాలతో అనార్థాలివే...
►గట్టి శబ్దాల వల్ల నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వయోవృద్ధులు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. మనకు హాని కలిగించే శబ్దాలను రెండురకాలు విభజించుకోవచ్చు. మొదటిది... అకస్మాత్తగా వినిపించే శబ్దం... దీన్ని ఇంపల్స్‌ సౌండ్‌ అంటారు. రెండోది... దీర్ఘకాలం పాటు శబ్దాలకు అలా ఎక్స్‌పోజ్‌ అవుతూ ఉండటం. ఈ రెండోరకాన్ని క్రానిక్‌ అకాస్టిక్‌ ట్రామా  అంటారు. మనం దీపావళి సందర్భంగా ఎదుర్కొనే శబ్దం మొదటిదైన ఇంపల్స్‌ సౌండ్‌. దాంతో ఎన్నో రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి. ఉదాహరణకు... అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు  (ఇయర్‌ బ్లాక్‌) కావడం. చెవిలో నొప్పి, గుయ్‌మనే శబ్దం వినిపిస్తూ ఉండటం. చెవి లోపల ఇయర్‌ డ్రమ్‌ (టింపానిక్‌ పొర) దెబ్బతినడం. కొన్ని సందర్భాల్లో చెవి నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి నష్టం కూడా జరగవచ్చు.

►ఏదైనా పెద్ద శబ్దం అయి చెవికి తాత్కాలికంగా నష్టం జరిగి వినిపించకపోవడం అంటూ జరిగితే సాధారణంగా 16 గంటల నుంచి 48 గంటలలోపు దానంతట అదే సర్దుకొని రికవరీ అవుతూ ఉంటుంది. అలా తాత్కాలికంగా వినిపించకపోయే దశను ‘టెంపొరరీ థ్రెషోల్డ్‌ షిఫ్ట్‌’గా పేర్కొనవచ్చు. ఆ వ్యవధి దాటిన తర్వాత కూడా చెవి వినిపించకపోతే అప్పుడు దాన్ని శాశ్వత నష్టంగా భావించాల్సి ఉంటుంది.

►గర్భిణుల్లో 140 డిసిబుల్స్‌కు మించిన పెద్ద శబ్దం వల్ల కలిగే స్టిమ్యులేషన్స్‌తో నొప్పులు వచ్చి నెలలు నిండటానికి ముందే ప్రసవం  కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే గర్భవతులు  బాణాసంచా శబ్దాల నుంచి దూరంగా ఉండాలి. ఇక వయోవృద్ధులు కూడా శబ్దాలతో  ప్రభావితమవుతారు కాబట్టి వారూ దూరంగానే ఉండాలి.

జాగ్రత్తలు: శబ్దాల వల్ల కలిగే దుష్ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు కొందరు చెవిలో దూది పెటుకుంటారు. చెవిలో దూదివల్ల కేవలం 7 డెసిబుల్స్‌ కంటే తక్కువగా ఉండే శబ్దాల నుంచి మాత్రమే రక్షణ లభిస్తుంది. టపాకాయల శబ్దం 100–120 డెసిబుల్స్‌ వరకు ఉంటుంది. అందుకే ఈ శబ్దాల నుంచి రక్షించుకోడానికి వీలైతే ఇయర్‌ప్లగ్స్‌ వంటివి వాడటం మంచిది.

►పెద్ద పెద్ద శబ్దాలకు ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు చెవిలో ఎలాంటి ఇయర్‌ డ్రాప్స్, నీళ్లూ, నూనె వెయ్యకూడదు.

►శబ్దాల కారణంగా చెవి ప్రభావితమైనప్పుడు ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించాలి. వారు ఆడియోమెట్రీ వంటి పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు.

►పొగకూ, రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి.

►బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం వంటివి చేయకూడదు.
డాక్టర్‌ ఇ.సి. వినయ కుమార్‌ హెచ్‌ఓడి –
ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement