
దీపావళి పండగ మనసుకే కాదు... దీపకాంతులతో కళ్లకూ పండగే. రంగురంగుల కాంతులీనుతూ వెలిగే బాణాసంచా, మతాబులు కళ్లను మిరుమిట్లు గొలుపుతాయి. కానీ ఆ సంబరాలూ సంరంభాలూ కళ్లకు ప్రమోదమే గానీ ప్రమాదం తెచ్చిపెట్టకూడదు. సురక్షితమైన దీపావళి వేడుకలతో మన కళ్లను కాపాడుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోండి. పనిలో పనిగా కళ్లతో పాటు ఒంటినీ సంరక్షించుకోండిలా.
జాగ్రత్త
►దీపావళి బాణాసంచాతో గాయం అయ్యేందుకు చర్మానికే ఎక్కువ అవకాశం. కారణం... చర్మం మానవ శరీరాన్నంతా కప్పి ఉంచే అత్యంత పెద్ద అవయవం కావడమే.
►బాణాసంచా కేవలం లైసెన్స్‌డ్ షాప్‌లోనే కొనాలి.
►ఇంట్లో ఓ కార్డ్‌బోర్డ్ బాక్స్ వంటి దాన్లో పెట్టాలి.
►ఆ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి.
►బాణాసంచాను చెల్లాచెదురుగా ఉంచకూడదు.
►సాయంత్రం వాటిని కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి.
►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి.
►వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది.
►నిత్యం నీళ్లు ఎక్కువగా తాగడం చర్మానికి ఎంతో మంచిది. అయితే దీపావళి సందర్భంగా ఆ నిబంధనను మరింత శ్రద్ధగా పాటించాలి. ఎందుకంటే... పొరబాటున చర్మం కాలితే ఆ ప్రక్రియలో చర్మం నీటిని కోల్పోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే గాయం తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది.
►బాణాసంచా కాల్చేప్పుడు ఎప్పుడూ ఒకే సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు.
►కాల్చేసమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది.
►కాల్చేప్పుడు టపాకాయ నుంచి మనం దూరంగా ఉండటానికి వీలుగా మోచేతిని వంచకుండా పూర్తిగా సాగదీయాలి. మోచేతిని ఎంతగా వంచితే టపాకాయకు అంత దగ్గరవుతాం.
►టపాసు నుంచి తలను వీలైనంత దూరంగా ఉంచాలి.
►ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు.
►నీళ్ల బకెట్‌ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి.
►గాయానికి తడి టవల్‌ను చుట్టి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.
►వేడి సోకడం వల్ల చర్మానికి అయ్యే గాయాన్ని మూడు విధాల వర్గీకరించవచ్చు. మొదటిది పైపైన (సూపర్‌ఫీషియల్), ఓమోస్తరు లోతుగాయం (మీడియన్ డెప్త్), మూడో రకం తీవ్రంగా కాలిన గాయాలు (డీప్ బర్న్స్).
►వీటిల్లో మీడియన్ డెప్త్, డీప్ బర్న్ గాయాల వల్ల చర్మంపై మచ్చ (స్కార్) మిగిలిపోయే అవకాశం ఉంటుంది.
►గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
►గాయాన్ని కడగడానికి సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీళ్లను మాత్రమే ఉపయోగించాలి.
►ఐస్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదు.
►డాక్టర్ దగ్గరికి వెళ్లేవరకు తడిగుడ్డతో గాయాన్ని కప్పి ఉంచవచ్చు.
►కాలిన గాయలు తీవ్రమైతే ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి.
►గాయం అయిన సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు.
►కాలి, చేతుల వేళ్లకు తీవ్రమైన మంట సోకితే అవి ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్య తడి వస్త్రం ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలి.
►బాణాసంచా ఎప్పుడూ ఆరు బయటే కాల్చాలి.
►ఇంటి కారిడార్లలో, టెర్రెస్‌పైన, మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు.
►టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్‌ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు.
►మరింత శబ్దం వస్తుందని కుండలవంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది.
►చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు.
ఐ కేర్
►మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రభావం.
►ఇక పరోక్షంగా కూడా... సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు.
►తీక్షణమైన వెలుగును నేరుగా చూడవద్దు. దానివల్ల కార్నియల్ బర్న్స్ రావచ్చు. అందుకే బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు.
►కొన్ని రకాల బాణాసంచా నుంచి నిప్పురవ్వల వంటివి కంటికి తాకే అవకాశం ఉన్నందున అలాంటి వాటిని కాల్చే సమయంలో... కాల్చగానే వీలైనంత దూరం పోవాలి.
►కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు.
►బాణాసంచా కాల్చేసమయాల్లో కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది.
►వెలుగులు, రవ్వలతోపాటు వేడిమి వల్ల కూడా కన్ను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లడం మంచిది.
►రాకెట్ వంటివి పైకి వెళ్లకుండా కంటిని తాకితే దానికి గాయం (మెకానికల్ ఇంజ్యూరీ) కూడా అయ్యే అవకాశం ఉంది. గాయం వల్ల ఒక్కోసారి కంటి లోపల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
►డైరెక్ట్ మంట కంటికి తగిలి కన్నుగాని, కనురెప్పలుగానిక తాగే అవకాశం ఉంది. ఫలితంగా కార్నియా దెబ్బతింటే శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది.
►అలాంటిదే జరిగితే కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప ఇతర చికిత్సలతో ఫలితం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి.
►గాయం ఎలాగైనప్పటికీ ఒక కన్ను మూసి విజన్ పరీక్షించి చూసుకోవాలి. చూపులో ఏమాత్రం తేడా ఉన్నా వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌ను కలిసి చూపించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment