కలిసికట్టుగా ‘హరితహారం’
♦ విద్యార్థులను భాగస్వాములను చేయాలి
♦ ఆ గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే
♦ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ప్రోగ్రాం
♦ చైర్మన్ ఆర్.దిలీప్‌రెడ్డి
సాక్షి, సంగారెడ్డి: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ప్రోగ్రాం చైర్మన్ ఆర్.దిలీప్‌రెడ్డి అన్నారు. ఉద్యమంలా హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందులో విద్యార్థుల భాగస్వాములను చేయాల్సిన గురుతర బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘బంగారు తెలంగాణ-బాలల హరితహారం’పై నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ప్రోగ్రాం చైర్మన్, ఆర్‌టీఐ మాజీ కమిషనర్ ఆర్.దిలీప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మదిలో మొక్కలు పెంచాలన్న భావన పెంచాలన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నదన్నారు. పర్యావరణ సమత్యులత దెబ్బతినటం వల్లే వర్షాలు సకాలంలో కురవటంలేదన్నారు. దీనిని నివారించాలంటే మొక్కలు పెంపకం ఒక్కటే మార్గమన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా బాలల హరితహారం విజయవంతానికి సహకరించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, మదన్‌రెడ్డి, జి.మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్, డీఈఓ తదితరులు పాల్గొన్నారు.