green denominator
-
త్వరలోనే రాష్ట్రానికి కల్లుగీత పరికరాలు
కల్లుగీత కార్మికులకు తోడ్పడే పరికరాలను రాష్ట్రంలో ప్రవేశపె ట్టబోతున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. త్వరలోనే నల్లగొండ జిల్లాకు ఈ పరికరాలను పంపుతామ న్నారు. కల్లు దుకాణాల అంశంపై ఓ ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు. కల్లుగీత యంత్రాల కోసం అధికారులు ఇప్పటికే కేరళలో అధ్యయనం చేసి వచ్చారని చెప్పారు. కల్లు గీత అభివృ ద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, హరితహారంలో ఈ ఏడాది 54 లక్షల తాటి, ఈత చెట్లు నాటామన్నారు. వచ్చే ఏడాది 2 కోట్లు, తర్వాతి ఏడాది 5 కోట్ల చెట్లను నాటాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కల్లు గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ‘కల్లు మూడు రకాలు. పోద్దాళ్లు, పరుపుదాళ్లు, పందాళ్లు అనే రకాల చెట్ల నుంచి కల్లు వస్తుంది. అందులో పోద్దాళ్లు, పందాళ్ల కల్లులో ఔషధ గుణాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. -
చెట్టు అమ్మ లాంటిది: డాక్టర్ కేవీ రమణాచారి
చెట్టు అమ్మ లాంటిదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సి బాధ్యత మనదేనన్నారు. ప్రకృతి సమతుల్యత ఉంది అంటే దానికి కారణం చెట్టేనని చెప్పారు. ఎప్పుడో మన పెద్దలు నాటిన మొక్కలతో మనం ఎంతో లబ్ధిపొందుతున్నామన్నారు. ఇప్పుడు నాటే మొక్కలు 20 ఏళ్ల తర్వాత ఫలితాలను మన భావితరాలకు అందిస్తాయని తెలిపారు. ఎంతోమంది కవులు, గాయకులు కూడా చెట్టు ప్రాధాన్యత విశదీకరించారన్నారు. సీఎం మందుచూపుతో ఎంతో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రభుత్వంలోని ప్రతిశాఖ మరో మూడు నెలల పాటు చెట్లను నాటడం వాటిని రక్షించటం చేయాలని తెలిపారు. చెట్లపై సారధి కళాకారిణి స్పందన బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఇన్చార్జ్ ఏవో మనోహర ప్రసాద్, రవీంద్రభారతి, సాంస్కృతిక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మెతుకుసీమకు పచ్చల హారం
సిద్దిపేట జోన్: హరిత హారంలో భాగంగా ఊరూరా మొక్కలు నాటేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచారు. అవసరమైన మేరకు మొక్కలను సిద్ధం చేశారు. అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల వారు భాగస్వాములయ్యేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. అవసరమైన మొక్కలను సమకూర్చేందుకు గాను జిల్లా కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటైంది. ఈ కేంద్రంలోని టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసిన వెంటనే మొక్కలను అందజేసేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని ఊరూరా ప్రారంభించనున్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు మెదక్ డివిజన్లో పాల్గొననున్నారు. ఏర్పాట్లలో తలమునకలైన అధికారులు.. అటవీ, ఉద్యాన, డ్వామా తదితర ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ మూడున్నర కోట్ల మొక్కలను నాటే కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. అటవీ శాఖకు చెందిన రిజర్వ్ ఫారెస్ట్‌లో 48 లక్ష ల మొక్కలను నాటాలని, అటవేతర ప్రాంతంలో 2.52 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కందకాలు, ప్రభుత్వ భూములు, పరిశ్రమలు, వివిధ రకాల సంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ దిశగా నిర్దేశిత ప్రాంతాలను గుర్తించి, గుంతలు తీయడం, మొక్కలు, ట్రీగార్డ్‌లు అందజేయడం, ఎరువుల సరఫరా తదితర అంశాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు దశల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికే పలు పర్యాయాలు జిల్లా స్థాయిలో మంత్రి హరీశ్‌రావు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, డివిజన్ పరిధిలో ఆర్డీఓలు, మండల పరిధిలో ఎంపీడీఓల స్థాయిలో సమీక్ష సమావేశాలను విస్తృతంగా నిర్వహించారు. పంచాయతీకి 40 వేల మొక్కల చొప్పున... ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శాఖల వారీగా నివేదికను రూపొందించింది. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ఎంపీడీఓలను మండల ప్రత్యేక అధికారిగా నియమించింది. మొక్కలు విరివిగా నాటేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే ఈజీఎస్ పథకం కింద గుంతలు తీయడం, మొక్కల దిగుమతి వంటి ప్రక్రియను చేపడుతున్నారు. ముందస్తుగా మొక్కలపై దృష్టి .. జిల్లాలోని 450 నర్సరీల నుంచి అవసరమైన మొక్కలను సమీప ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు డ్వామా, అటవీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అడవుల్లో ఇప్ప, మోదుగ, నారింజ, వేప, అల్లనేరడి, తుమ్మ, రక్తగండ వంటి ఇతర మొక్కలను నాటేందుకు, కందక ప్రాంతాల్లో కానుగ, ఈత, నీలగిరి, తుమ్మ, మొక్కలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టేకు, గుమ్మడి టేకు, పండ్ల, పూల మొక్కలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కల లభ్యతను సరిచూసుకున్న అధికారులు ఖమ్మం జిల్లాలోని గరిముల్లపాడు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మొక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. ముఖ్యంగా మామిడి, కొబ్బరి, సపోట వంటి 10 రకాల మొక్కలను ఖమ్మం జిల్లా నుంచి తెప్పిస్తున్నట్టు సమాచారం. -
కలిసికట్టుగా ‘హరితహారం’
♦ విద్యార్థులను భాగస్వాములను చేయాలి ♦ ఆ గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే ♦ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ప్రోగ్రాం ♦ చైర్మన్ ఆర్.దిలీప్‌రెడ్డి సాక్షి, సంగారెడ్డి: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ప్రోగ్రాం చైర్మన్ ఆర్.దిలీప్‌రెడ్డి అన్నారు. ఉద్యమంలా హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందులో విద్యార్థుల భాగస్వాములను చేయాల్సిన గురుతర బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘బంగారు తెలంగాణ-బాలల హరితహారం’పై నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ప్రోగ్రాం చైర్మన్, ఆర్టీఐ మాజీ కమిషనర్ ఆర్.దిలీప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మదిలో మొక్కలు పెంచాలన్న భావన పెంచాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నదన్నారు. పర్యావరణ సమత్యులత దెబ్బతినటం వల్లే వర్షాలు సకాలంలో కురవటంలేదన్నారు. దీనిని నివారించాలంటే మొక్కలు పెంపకం ఒక్కటే మార్గమన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా బాలల హరితహారం విజయవంతానికి సహకరించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, మదన్‌రెడ్డి, జి.మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్, డీఈఓ తదితరులు పాల్గొన్నారు.