మెతుకుసీమకు పచ్చల హారం
సిద్దిపేట జోన్: హరిత హారంలో భాగంగా ఊరూరా మొక్కలు నాటేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచారు. అవసరమైన మేరకు మొక్కలను సిద్ధం చేశారు. అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల వారు భాగస్వాములయ్యేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది.
అవసరమైన మొక్కలను సమకూర్చేందుకు గాను జిల్లా కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటైంది. ఈ కేంద్రంలోని టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసిన వెంటనే మొక్కలను అందజేసేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని ఊరూరా ప్రారంభించనున్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు మెదక్ డివిజన్‌లో పాల్గొననున్నారు.
ఏర్పాట్లలో తలమునకలైన అధికారులు..
అటవీ, ఉద్యాన, డ్వామా తదితర ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ మూడున్నర కోట్ల మొక్కలను నాటే కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. అటవీ శాఖకు చెందిన రిజర్వ్ ఫారెస్ట్‌లో 48 లక్ష ల మొక్కలను నాటాలని, అటవేతర ప్రాంతంలో 2.52 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కందకాలు, ప్రభుత్వ భూములు, పరిశ్రమలు, వివిధ రకాల సంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ దిశగా నిర్దేశిత ప్రాంతాలను గుర్తించి, గుంతలు తీయడం, మొక్కలు, ట్రీగార్డ్‌లు అందజేయడం, ఎరువుల సరఫరా తదితర అంశాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు దశల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికే పలు పర్యాయాలు జిల్లా స్థాయిలో మంత్రి హరీశ్‌రావు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, డివిజన్ పరిధిలో ఆర్డీఓలు, మండల పరిధిలో ఎంపీడీఓల స్థాయిలో సమీక్ష సమావేశాలను విస్తృతంగా నిర్వహించారు.
పంచాయతీకి 40 వేల మొక్కల చొప్పున...
ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శాఖల వారీగా నివేదికను రూపొందించింది. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ఎంపీడీఓలను మండల ప్రత్యేక అధికారిగా నియమించింది. మొక్కలు విరివిగా నాటేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే ఈజీఎస్ పథకం కింద గుంతలు తీయడం, మొక్కల దిగుమతి వంటి ప్రక్రియను చేపడుతున్నారు.
ముందస్తుగా మొక్కలపై దృష్టి ..
జిల్లాలోని 450 నర్సరీల నుంచి అవసరమైన మొక్కలను సమీప ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు డ్వామా, అటవీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అడవుల్లో ఇప్ప, మోదుగ, నారింజ, వేప, అల్లనేరడి, తుమ్మ, రక్తగండ వంటి ఇతర మొక్కలను నాటేందుకు, కందక ప్రాంతాల్లో కానుగ, ఈత, నీలగిరి, తుమ్మ, మొక్కలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టేకు, గుమ్మడి టేకు, పండ్ల, పూల మొక్కలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కల లభ్యతను సరిచూసుకున్న అధికారులు ఖమ్మం జిల్లాలోని గరిముల్లపాడు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మొక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. ముఖ్యంగా మామిడి, కొబ్బరి, సపోట వంటి 10 రకాల మొక్కలను ఖమ్మం జిల్లా నుంచి తెప్పిస్తున్నట్టు సమాచారం.