భారతీయుడికి గోల్డ్‌మాన్ బహుమతి
శాన్ ఫ్రాన్సిస్కో: క్షేత్రస్థాయిలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఛత్తీస్‌గఢ్ పర్యావరణ కార్యకర్త రమేశ్ అగర్వాల్ ప్రతిష్టాత్మక ‘గోల్డ్‌మాన్ పర్యావరణ బహుమతి’ని గెలుపొందారు. రమేశ్‌తో సహా ఈ ఏడాది ఆరు ఖండాల నుంచి ఆరుగురు కార్యకర్తలు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు కింద విజేతలకు రూ.1.06 కోట్ల నగదు అందజేస్తారు. రాయ్‌పూర్‌లో ఇంటర్నెట్ కేఫ్ నడుపుతున్న రమేశ్ సమాచార హక్కు చట్టం ద్వారా స్థానికుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకొచ్చారు.
పర్యావరణ అనుమతులు లేకుండానే బొగ్గు గనుల తవ్వకం కోసం ప్రయత్నించిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రమేశ్ ఆ కంపెనీ ప్రాజెక్టును అడ్డుకున్నారు. దీంతో ఆయనపై కత్తిగట్టిన పారిశ్రామిక శక్తులు 2008లో కిరాయి వ్యక్తి ద్వారా కాల్పులు జరిపించగా కాలి ఎముకలు ఛిద్రమై ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.