ప్రతీ నియోజకవర్గానికి 40 లక్షలు, గ్రామానికి 33వేలు.. ఏటా 3.30 కోట్ల మొక్కలు నాటాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రతీ నియోజకవర్గానికి 40 లక్షలు, గ్రామానికి 33వేలు.. ఏటా 3.30 కోట్ల మొక్కలు నాటాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. వచ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రం హరితవనం కావాలన్నది ఆయన కల. దీనికోసం పదికోట్ల మొక్కలు నాటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్ని పచ్చటి వనంలా మార్చాలని అధికారులను ఆదేశించారు. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ‘వనమహోత్సవానికి’ వరుణుడు కరుణించడంలేదు. ఏటా జూలై మొదటివారంలో నిర్వహించాల్సిన వనమహోత్సం.. వర్షాలు కురవకఆలస్యమవుతోంది. ఈ సంవత్సరం వనమహోత్సవానికి ఇబ్రహీంపట్నం రేంజ్‌లోని బొంగ్లూర్ అటవీ ప్రాంతం వేదిక కానుంది. పనులు పూర్తి చేసుకుని వాన రాకకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరుసగా మన జిల్లాలోనే..
వనమహోత్సంలో భాగంగా ప్రభుత్వం ప్రారంభించే మొక్కలు నాటే సామూహిక కార్యక్రమం వరుసగా మన జిల్లాలోనే నిర్వహిస్తున్నారు. గత ఏడాది మేడ్చల్ మండలం కండ్లకోయ వద్ద, అంతకుముందు సంవత్సరం మహేశ్వరం మండలం తుమ్మలూరు అటవీ ప్రాంతంలో వనమహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని బొంగ్లూర్ అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 6 హెక్టార్ల విస్తీర్ణంలో 6,060 మొక్కలను నాటే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కానీ ఈ కార్యక్రమం జరగాలంటే భారీస్థాయి వర్షం అవసరం. ఇప్పటివరకు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మోస్తరు వర్షాలు తప్ప భారీ వర్షం కురవలేదు. దీంతో వనమహోత్సవం తేదీ ఖరారు కాలేదు. సీఎం కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 6 హెక్టార్ల విస్తీర్ణంలో భూమిని దుక్కి చేసి మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్నారు. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఆగస్టు మూడో వారంలో..?
సరిపడా వర్షాలు కురవక పోవడంతో కార్యక్రమ నిర్వహణకు ఆలస్యమవుతోంది. గత రెండ్రోజులుగా ముసురు పడుతుండడం.. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్ష సూచనకు అవకాశం ఉండటంతో త్వరలోనే తేదీ ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు మూడో వారంలో వనమహోత్సవ కార్యక్రమం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ భారీ వర్షం కురిస్తే ఈ కార్యక్రమాన్ని అంతకుముందుగానే పూర్తి చేయించే పరిస్థితులూ లేకపోలేదు. దీనికి వర్షమే ఆధారం కావడంతో ఎదురుచూపులు తప్పడం లేదు.