మొక్కల్ని బిడ్డల్లా సాదాలె! | Chief Minister KCR about haritha haram program | Sakshi
Sakshi News home page

మొక్కల్ని బిడ్డల్లా సాదాలె!

Published Thu, Jul 13 2017 12:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

మొక్కల్ని బిడ్డల్లా సాదాలె! - Sakshi

మొక్కల్ని బిడ్డల్లా సాదాలె!

రాష్ట్రంలో పచ్చదనం వెల్లివిరియాలి ముఖ్యమంత్రి కేసీఆర్‌
► రెండేళ్లలో కరీంనగర్‌లో చెట్లే కనబడాలె
► మొక్కలు సంరక్షిస్తే నగదు అవార్డులు
► కోటి ఎకరాలకు నీరివ్వడమే ప్రభుత్వ లక్ష్యం
► వచ్చే జూన్‌లోగా ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు
► కొందరు సన్నాసులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు
► వాళ్లవి చేసిన మొఖాలా? చూసిన మొఖాలా?
► కరీంనగర్‌లో మూడో విడత హరితహారం ప్రారంభించిన ముఖ్యమంత్రి


సాక్షి, కరీంనగర్‌/సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘‘తెలంగాణ ప్రజలకు ఆకుపచ్చ హరిత వందనాలు.. దండం పెట్టి.. కాళ్లు మొక్కి పాదాభివందనం చేస్తున్న.. ఇంట్ల పిలగాన్ని ఎట్ల సాదుతరో.. మొక్కలను కూడా అట్ల సాదాలె.. పిల్లలను పెంచి కష్టపడి చదివించి ఎంత ధనం ఇచ్చినా వారు బతికే పరిస్థితి లేకపోతే లాభం లేదు.. ఆ ధనం ఉపయోగం కాదు.. ఆస్తి ఇవ్వడం కాదు.. ఆ ఆస్తిని అనుభవించే వాతావరణానికి అవకాశం ఉంటేనే పిల్లల్ని మంచిగ పెంచినట్లు లెక్క.. లేదంటే ఆ జీవితాలు వ్యర్థమైతయి’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

ప్రతి ఇంట్లో ఎందరు ఉంటే అంత మంది పేరిట మొక్కలు నాటి రాష్ట్రాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చాలని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రం లో ఎల్‌ఎండీ దిగువన ‘మహాగని’మొక్క నాటి ఆయన మూడో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో అరగంటపాటు సమావేశమయ్యారు. తర్వాత అంబేడ్కర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...

ఉద్యమంలా విస్తరించాలె
మనిషికిన్ని చెట్లు పెట్టి రాష్ట్రాన్ని పచ్చబడగొట్టాలే. ఇంట్ల ఎంత మంది ఉంటే అంత మంది పేరు మీద మొక్కలు నాటాలె. మీ ఇంటి మనుషుల పేర్లే వాటికి పెట్టుకొని మీరు నీళ్లు తాగినప్పుడు వాటికిన్ని పోసి సాదాలే. మొక్కలు పెట్టుడు అనేది ఎవరో వేరే వాళ్ల పని కాదు. మన సొంత పని. మన ఇంటి పని. పుట్టినప్పుడు మనలను ఊపే ఊయల.. సచ్చినపుడు మనలను మోసే పాడె కూడా కర్రతోనే తయారయితది. పుట్టినప్పట్నుంచి సచ్చే దాకా మనతో ఉండే చెట్టును పెంచాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.

రెండేళ్లలో నేను కరీంనగర్‌కు హెలికాప్టర్‌లో వస్తే అన్ని చెట్లే కనబడాలె. కరీంనగర్‌ నుంచి ప్రారంభమైన హరితహారం ఉద్యమంలా రాష్ట్రం అంతటా విస్తరించాలె. నాడు తెలంగాణ కోసం కరీంనగర్‌లో తొడగొట్టి సింహగర్జన చేస్తే చాలా మంది సన్నాసులకు నమ్మకం లేకుండే.. చాలా అవమానం చేసినరు. కానీ తెలంగాణ వచ్చి తీరింది. ఆ రోజు తెలంగాణ తెస్తా అని చెప్పినా.. తెచ్చి చూపిచ్చిన. ఈరోజు తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు రావాలే. చెట్లు పెరగాలే. పశుపక్ష్యాదులు పెరగాలే. తెలంగాణ పచ్చదనంతో అలరారాలె. పంటలు పండాలే.. పరిశ్రమలు రావాలే. అన్ని రంగాల్లో ముందుండాలే.

పట్టుబడితే పచ్చబడుతది
సమైక్య రాష్ట్రంలో అటవీశాఖను నాశనం చేసిండ్రు. చెరువులు ఎట్ల నాశనం చేసిండ్రో అట్ల పచ్చదనాన్ని నాశనం చేసిండ్రు. కరువు కాటకాలు చూపించిండ్రు. జిల్లా ప్రజలకు నేను తీపి మాట చెబుతున్నా. తెలంగాణలో వచ్చే సంవత్సరం జూన్‌ నాటికి అత్యధికంగా లాభించబోతున్న జిల్లా కరీంనగర్‌. చెట్టు పెంచే కార్యక్రమాన్ని అందరూ ఒక ప్రతిజ్ఞలా తీసుకోవాలే. మనం పట్టుబడితే తెలంగాణ అంత పచ్చబడుతది. హరిత వనాలు పెరగాలే. ప్రతి గ్రామంలో, పట్టణంలోని ప్రతి మున్సిపల్‌ వార్డులో గ్రీన్‌ బ్రిగేడ్స్‌ ఏర్పాటు కావాలి.

ప్రతి ఊరికి 51 మంది సభ్యులతో ఒక గ్రీన్‌ బ్రిగేడ్‌ ఉండాలే. మొక్కలు తెప్పించడం.. నాటడం.. పెంచడాన్ని గ్రీన్‌ బ్రిగేడ్‌ పర్యవేక్షణ చేయాలే. అట్లా చేసే సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ఇస్తాం. ప్రతి జిల్లాకు ఒక ఉత్తమ గ్రామ పంచాయతీని ఎంపిక చేసి రూ.5 లక్షలు, ఉత్తమ మండలానికి రూ.8 లక్షలు, పట్టణంలో అవార్డుకు రూ.5 లక్షలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు రూ.2 లక్షలు, జూనియర్, డిగ్రీ, ఉత్తమ ప్రభుత్వ శాఖలకు రూ.2 లక్షలు, ఉత్తమ ప్రజా ప్రతినిధినికి, ఉత్తమ ప్రభుత్వ అధికారికి రూ.లక్ష చొప్పున అందిస్తాం.

వాళ్లవి చేసిన మొఖాలా..? చూసిన మొఖాలా?
రైతుల సంక్షేమంపై నేను చేసిన ప్రకటనతో ప్రధాని కూడా ఆశ్చర్యపోయాడు.. 28 రాష్ట్రాల సీఎంలలో సగం మంది ఫోన్‌ చేసిండ్రు.. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరానికి రూ.8 వేల పెట్టుబడిని ప్రభుత్వం అందించనుంది. అలాగే యాదవ, మత్స్య సోదరుల గురించి ఆలోచన చేసినం. యాదవుల కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అక్కడక్కడ కొంత మంది సన్నాసులు మాట్లాడుతున్నరు.. వాళ్లవి చేసిన మొఖాలా? చూసిన మొఖాలా? పంపిణీ కోసం తలపెట్టిన గొర్రెలు ప్రాథమికంగా 84 లక్షలు. కానీ 7.5 లక్షల దరఖాస్తులు వచ్చినయ్‌. దాని ప్రకారం ఇంకా 50 లక్షల గొర్రెలు కావాలే. ఈ లెక్కన 1.25 లక్షల యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయబోతున్నాం. ఇండియాలోనే ఇది ఎక్కడ లేదు.

‘ఏం నాయినా.. గొర్రెలన్నీ నువ్వే లూటీ చేస్తున్నవ్‌..’అని వేరే రాష్ట్రం వాళ్లు ఆశ్చర్యపడుతున్నరు. కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష గొర్రెలు అవాకులు చవాకులు పేలుతున్నరు. ఇంత పెద్ద స్కీంలో ఎక్కడన్న 10 గొర్రెలు సచ్చిపోతే దాన్ని వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో పెట్టి సన్నాసుల్లా విమర్శ చేస్తున్నరు. ఇలాంటి సన్నాసులను ఖాతరు చేయకండి. ఈ చిల్లరగాండ్ల ఆలోచన రాజకీయాలపై తప్ప ప్రజల గురించి కాదు. మనం కాంగ్రెస్‌ పాలన జూడలేదా? వాళ్లు గంధర్వులా? హిమాలయాల్లో ఆకు పసరు తాగి వచ్చిళ్లా? ఇప్పుడే పవిత్రమైపోయిళ్లా? మనం జూసినోళ్లు కాదా? అవకాశం వస్తే పంటికి అందకుండా మింగుతరు.

వాళ్ల దుర్మార్గాలను పరికి కంపను తొలగించినట్టు తీస్తున్నాం. కల్తీ అంతా కాంగ్రెస్‌ పుణ్యమే. చిల్లర రాజకీయాలతో ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు. రాజకీయ బేహారులు కొందరు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నరు. రాష్ట్రంలో పేకాటను బంద్‌ చేసి, గుడుంబాను నిర్మూలించి, కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నాం. పిల్లల్ని చెడగొట్టే గంజాయిలాంటి మాదకద్రవ్యాలు వస్తున్నాయి. తోలు తీయమని చెబితే పోలీసులు విజృంభిస్తున్నారు. ఈ దందాలన్నీ కాంగ్రెస్‌ పుణ్యమాని ఇన్నేళ్లు వర్ధిల్లినయి. నేను ఒక్కటే చెబుతున్నా.. మీ దీవెన ఉన్నం త వరకు మొండిగా ముందుకు పోతా.

కాళేశ్వరంతో 40 లక్షల ఎకరాలకు నీళ్లు
మున్ముందు తెలంగాణ మొత్తంలో అత్యధికంగా లాభం పొందబోతున్న జిల్లా కరీంనగర్‌ అని చెప్తున్నా. మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు ప్రాజెక్టులు కాళేశ్వరంతో అనుసంధానం అవబోతున్నాయి. పనులు కూడా పూర్తి కావచ్చాయి. కాళేశ్వరం స్వామి దయతో... వచ్చే ఏడాది జూన్‌ నాటికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఉన్న దాదాపు 15 నుంచి 16 లక్షల ఎకరాలకు వచ్చే ఏడాది నుంచి రెండు పంటలకు నీళ్లు అందిస్తాం.

ప్రాజెక్టును నేనే వచ్చి ప్రారంభిస్తా. దేశంలోనే గొప్ప జిల్లాగా కరీంనగర్‌ను నిలబెడుతా. నగరాన్ని లండన్‌లా మారుస్తా. వరంగల్‌ జిల్లాకు కూడా రెండు పంటలు పండే అవకాశం కాళేశ్వరం ద్వారా లభిస్తుంది. మెదక్‌ , నిజామాబాద్‌ జిల్లాలు కూడా దాదాపు 15 నుంచి 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందబోతున్నాయి. ఒక్కసారి కాళేశ్వరం అనుసంధానం అయితే ఉత్తర తెలంగాణ మొత్తం 40 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చే వరకు ప్రభుత్వం నిద్రపోదని హామీ ఇస్తున్నాను. వచ్చే డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరిగి తీరుతుంది. రాష్ట్రానికి పట్టిన తాగునీటి సమస్య పీడ శాశ్వతంగా తొలగిపొతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement