30 కోట్ల మొక్కలతో హరితహారం | Haritaharam with 30 million plants | Sakshi
Sakshi News home page

30 కోట్ల మొక్కలతో హరితహారం

Published Mon, Jul 3 2017 1:57 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

30 కోట్ల మొక్కలతో హరితహారం - Sakshi

30 కోట్ల మొక్కలతో హరితహారం

- కరీంనగర్‌లో ఒకేరోజు లక్ష మొక్కలతో మూడో విడత కార్యక్రమం
ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
మొక్కలు నాటే వ్యక్తులు, సంస్థలకు ప్రోత్సాహకాలిచ్చేలా కార్యాచరణ
ఈసారి కొత్తగా సీడ్‌ బాల్‌ టెక్నిక్‌  
 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు హరితహారం పథకం మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా కరీంనగర్‌ పట్టణంలో ఒకేరోజు లక్ష మొక్కలు నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించా లని అటవీశాఖ కసరత్తు చేస్తోంది. సీఎంతో మాట్లాడి తేదీని ఖరారు చేయనుంది. అదే సమయంలో ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు సొంత నియోజకవర్గాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందిస్తోంది. గత హరిత హారం కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, పంచాయతీరాజ్‌ రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కల్లో 91 శాతం బతకగా నిరుపయోగ స్థలాల్లో నాటిన మొక్కల్లో 79 శాతం, ఖాళీ స్థలాలు, పోరంబోకు భూముల్లో నాటిన మొక్కల్లో 53 శాతం మొక్కలు బతికినట్లు అధికారులు లెక్కించారు.

ఈ నేపథ్యంలో మూడో విడత హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటడానికి ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కనీసం 50 మొక్కలు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటే వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేకంగా ఆర్థిక సహకారాన్ని అందించేలా కార్య చరణను రూపొందిం చారు. పెద్దఎత్తున మొక్కలు నాటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు వివిధ విభాగాల కోటాల నుంచి ప్రత్యేక నిధులను కేటాయించి ప్రోత్సహించాలని నిర్ణయించారు. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. హరితహారంలో ఈసారి కొత్తగా సీడ్‌ బాల్‌ పద్ధతిని అమలు చేయనున్నారు.

గుండ్రటి మట్టి ముద్దల్లో ముందుగానే ఎరువులు, విత్తనాలను కలిపి ఉంచుతారు. వాటిని ఏటవాలుగా ఉండే ప్రదేశాలు, కొండలు, గుట్ట ప్రాంతాల్లో చల్లితే సరిపోతుంది. వాటిని ప్రత్యేకంగా నాటాల్సిన పనిలేదు. హరితహారం పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 1,645 కోట్లు వెచ్చించింది. అయితే గత రెండు విడతల్లో నాటిన మొక్కల సంరక్షణ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్‌ సర్కార్‌... మూడో విడతలో మొక్కల రక్షణ బాధ్యతను ప్రభుత్వ పరంగా, ప్రజా చైతన్యంతో చేపట్ట బోయేందుకు సిద్ధమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement