12న ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
► పర్యటన ఖరారు.. వెల్లడించిన మంత్రులు
► హరితహారంపై అధికారులతో సమీక్ష
► నగరంలో ఏర్పాట్ల పరిశీలన
► లక్ష మొక్కలు నాటేందుకు ముమ్మర ఏర్పాట్లు..
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా చేపడుతున్న హరితహారం మూడో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కరీం‘నగరం’లో తలపెట్టిన ఒకే రో జు లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా హరితహారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆయన పర్యటన ఈనెల 12న ఖరారైనట్లు అటవీశాఖ మంత్రి జోగురామన్న, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో హరితహారం అమలుపై అధికారులతో సమీక్షించారు. సమన్వయంతో విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
గత అనుభవాలు పునరావృతం కాకుండా లక్ష్యంతో పాటు సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. నగరంలో ఒకేరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి సన్నద్ధం కావాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. లక్ష మొక్కలు నాటేందుకు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించిన యంత్రాంగం ఇప్పటికే నాటే స్థలాలను గుర్తించింది. నగరంలో 1.10 లక్షల మొక్కలతోపాటు అదనంగా కరీంనగర్ సమీప మండలాల్లో లక్ష అదనంగా నాటేందుకు సిద్ధమవుతోంది. పట్టణంలో 5 సెగ్మెంట్లుగా విభజించి వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగించారు
. రెవెన్యూ, జైలు, మెప్మా, మున్సిపల్, పోలీస్ శాఖలకు లక్ష్యాలను విధించారు. నర్సరీల నుంచి మొక్కలు.. ఇతర ట్రీగార్డులు తెప్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే క్రమంలో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక, హరితహారం స్పెషలాఫీసర్ ఆంజనేయులుతో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఎల్‌ఎండీ దిగువ భాగం, ఉజ్వల పార్కు, డ్యాం కట్ట వెంబడి స్పోర్ట్స్ స్కూల్ స్థలం, మార్క్‌ఫెడ్ స్థలాన్ని పరిశీలించారు. ఎల్‌ఎండీ కట్ట వెంబడి నుంచి పూల మొక్కలు నాటాలని సూచించారు.
సందర్శకులను ఆకర్షించేలా రంగురంగులా పూల మొక్కలు కట్ట మొత్తం ఆవరించేలా ఉండాలన్నారు. అలాగే దిగువ భాగాన 3–4 వరుసలలో మొక్కలు నాటాలన్నారు. 50 వేల మొక్కలను కడెం నుంచి తెప్పిస్తున్నామని, 35 వేల మొక్కలు జిల్లాకు వచ్చాయని, 2–3 రోజుల్లో మిగిలిన మొక్కలు వస్తాయని తెలిపారు. ఈ మొక్కలన్నీ 6 ఫీట్ల ఎత్తుతో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 35 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, మొక్కల రక్షణకు 45 వేల ట్రీగార్డులను తయారు చేయిస్తున్నామన్నారు. అందులో 20 వేలు అందాయని, మిగిలినవి రెండు రోజుల్లో ఇస్తారని తెలిపారు. ప్రహరీలున్న చోట అవసరం లేదన్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.