సముద్రాన్నీ లాక్కోవాలనుకుంటోంది
మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం
చవక్కాడ్(కేరళ): విలువైన రైతుల భూములను గుంజుకుంటున్నట్లే జాలర్ల నుంచి సముద్రాన్నీ లాక్కోవడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్‌లో భూమి బంగారంగా మారింది. వాళ్లు ఆ బంగారాన్ని తమ రైతుకు కాకుండా తమ మిత్రులకు ఇవ్వాలనుకుంటున్నారు. జాలర్ల విషయంలో ఈ పనే చేస్తున్నారు’ అని అన్నారు. కేరళలో రాహుల్ బుధవారం రెండో రోజు పర్యటనలో భాగంగా త్రిస్సూర్ జిల్లా చవక్కాడ్‌లో జరిగిన జాలర్ల సభలో ప్రసంగించారు. సముద్ర పర్యావరణ రక్షణ కోసం తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధాన్ని 45 రోజుల నుంచి 61 రోజులకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన దుయ్యట్టారు.
అంతకుముందు ఆయన చవక్కాడ్‌లోని బ్లాంగద్ బీచ్‌లో ఉన్న జాలర్ల కాలనీలో 51 ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. తర్వాత కిజక్కోట్ కరుణాకరన్ అనే జాలరి గుడిసెకు వెళ్లారు. అక్కడ రాహుల్‌కు చేపల కూర, ఇతర వంటకాలతో భోజనం పెట్టారు. తనకు అత్యంత రుచికరమైన చేపల కూరతో భోజనం పెట్టారని, ఈ వంటకాలను రుచి చూడ్డానికి మళ్లీ వస్తానని రాహుల్ తర్వాత జాలర్ల సభలో అన్నారు.