మట్టి గణపతికి జై
సాక్షి, సిటీబ్యూరో : గణనాథుల పండగ సమీపిస్తోంది. ఈ ఏడు పండగ తనతో పాటు నగర వాసుల్లో పర్యావరణ స్పృహను మోసుకొస్తోంది. గతానికి పూర్తి భిన్నంగా కాలనీలు, అపార్ట్‌మెంట్ సంఘాలు మహా నగర పర్యావరణానికి విఘాతం కలగని రీతిలో మట్టి గణపతులకు జైకొడుతున్నాయి. ఆలివ్, ట్రీగార్డ్, రెయిన్‌బో విస్టా సంస్థలతో కలిసి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆదివారం నుంచి మట్టి గణపతుల తయారీలో శిక్షణ, పంపిణీకి శ్రీకారం చుడుతోంది. మరో వైపు కాలుష్య నియంత్రణ మండలితో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వివిధ ఆకృతుల్లో మట్టి గణపతులను అందుబాటులోకి తేబోతున్నాయి.
నేటి నుంచి తయారీ–శిక్షణ: మట్టి గణనాథుల తయారీపై ‘సాక్షి–ఆలివ్ మిఠాయి’ సంయుక్తంగా నగరంలోని రెయిన్‌బో విస్టా, మలేషియన్ టౌన్‌షిప్ (రెయిన్ ట్రీపార్క్) తదితర గేటెడ్ కమ్యూనిటీల్లో ఈనెల 28న (ఆదివారం)ఉదయం విగ్రహాల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాయి. మట్టితో తయారు చేసే ప్రతిమలను స్థానికులకు అక్కడే ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆలివ్ మిఠాయి సంస్థల అధినేత దొరరాజు తెలిపారు. ఇళ్లలో పూజించుకునేందుకు సుమారు 5 వేల ప్రతిమలను గ్రేటర్ వ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.