Business Standard
-
గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం... వర్గీకరణ అవశ్యం
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్‌కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్‌కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్‌కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్‌ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు ప్రాధాన్యత దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. -
5.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి
ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూసీ) ఉద్యోగ, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం వల్ల దేశవ్యాప్తంగా 5.15కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తాజా సర్వేలో తేలింది. వీటిలో 93.5 లక్షల బ్రాహ్మణ కుటుంబాలుండగా.. 4.21కోట్ల కుటుంబాలు ఇతర వర్ణాలకు చెందినవిగా వెల్లడైంది. కాగా, 10% కోటా వల్ల పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ లబ్ధి పొందుతాయని, దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల్లో 42% ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని ‘బిజినెస్ స్టాండర్డ్’ సర్వేలో తేలింది. మేరీ ల్యాండ్ యూనివర్సిటీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్‌లు చేపట్టిన ‘ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (ఐహెచ్‌డీఎస్) గణాంకాల ప్రకారం 2016–17 ఆదాయ రికార్డుల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు సర్వే పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 124వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన ఈ 10% రిజర్వేషన్ల ప్రకారం.. ఏడాదికి 8లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది ప్రస్తుత ఓబీసీ క్రీమీలేయర్‌తో సమానం. 1993లో ఓబీసీ క్రీమీలేయర్ పరిమితి ఏడాదికి లక్ష రూపాయలు ఉండగా, క్రమంగా పెరుగుతూ 2017 నాటికది రూ. 8లక్షలకు చేరింది. ప్రస్తుతం ఈ పరిమితే కొనసాగుతోంది. ఐహెచ్‌డీఎస్ లెక్కల ప్రకారం దేశంలో 1.25కోట్ల బ్రాహ్మణ కుటుంబాలుంటే, వాటిలో 93 లక్షల కుటుంబాల వార్షికాదాయం రూ.8 లక్షల రూపాయల లోపేనని సర్వే వివరించింది. బ్రాహ్మణేతర కుటుంబాల్లో 4.21 కోట్ల కుటుంబాల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఈ కోటా వల్ల లబ్ధి పొందే కుటుంబాల్లో 17.2% పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌లో 13.3%, మహారాష్ట్రలో 12%, ఆంధ్రప్రదేశ్‌లో 5.8%, గుజరాత్లో 5.4%, బిహార్‌లో 5%, మధ్యప్రదేశ్‌లో 4.8% ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 36.5% ఉన్నాయి.ఈ కుటుంబాల్లో మూడింట రెండొంతులు గ్రామాల్లోనే నివసిస్తున్నాయని కూడా సర్వే వెల్లడించింది. -
రాష్ట్రాన్ని సిలికాన్ వ్యాలీగా మారుస్తా
- బిజినెస్ స్టాండర్డ్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడి - ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లు బెజవాడను పట్టించుకోలేదు - అందుకే ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా అభివృద్ధి చెందలేదు సాక్షి, విజయవాడ బ్యూరో: టెక్నాలజీలో రాష్ట్రాన్ని మరో సిలికాన్ వ్యాలీగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి స్కూల్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్‌గా పనిచేసేలా ప్రోత్సహిస్తామన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఈఓలా పనిచేస్తే కొందరు తనకు ఓట్లేయలేదని, ఇది రాజకీయ వాస్తవమన్నారు. చీఫ్ మినిస్టర్.. చీఫ్ మినిస్టర్‌గానే పనిచేయాలని తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువని, ఇక్కడినుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్‌తోపాటు అనేకమంది పారిశ్రామికవేత్తలు వచ్చినా ఎవరూ ఇక్కడ వ్యాపారాలు పెట్టలేదని చెప్పారు. అందుకే విజయవాడలో ఒక్క పరిశ్రమ కూడా అభివృద్ధి చెందలేదన్నారు. సోమవారం నగరంలోని ఒక హోటల్లో బిజినెస్ స్టాండర్డ్ దినపత్రిక పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ఏపీ రౌండ్‌టేబుల్ సమావేశంలో బాబు మాట్లాడారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా ఇప్పటివరకు 1,756 పరిశ్రమలకు 21 రోజుల్లో అన్ని అనుమతులూ ఇచ్చామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కింద ఈ ఏడాది రూ.958 కోట్లతో 995 యూనిట్లు ఏర్పాటు చేసి 16 వేల మందికి ఉద్యోగాలిచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్లే తామూ ఇవ్వాల్సివచ్చిందని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ ఎస్కే భట్టాచార్య.. గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్య, కార్మిక సంస్కరణల్లో ప్రభుత్వ దార్శనికత ఏమిటని ప్రశ్నించారు. అలాగే టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ, పారిశ్రామికవేత్త సాంబమూర్తి తదితరులు వేసిన ప్రశ్నలకు బాబు జవాబిచ్చారు. పారిశ్రామికవేత్తలు జాస్తి వెంకట్, వీపీ రమేష్ లోక్‌నాథన్, నాగరాజులు పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టేవరకు వెంటపడతా ‘పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఈ పెట్టుబడులు పెట్టేవరకు మీ వెంట పడతాను. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేస్తాం. ఒప్పందంలో అనుకున్నట్లుగా చేయకపోతే ఊరుకోం. మా అధికారులతో సమస్యలు ఉంటే అప్పటికప్పుడే పరిష్కరిస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటకరంగ పెట్టుబడిదారులకు తేల్చిచెప్పారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో పర్యాటక మిషన్, పర్యాటక విధానాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే ప్రాజెక్టులకు సంబంధించి రూ.830 కోట్ల విలువైన తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. అలాగే రూ.3,845 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) కుదుర్చుకున్నారు.