రాష్ట్రాన్ని సిలికాన్ వ్యాలీగా మారుస్తా
- బిజినెస్ స్టాండర్డ్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడి
- ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లు బెజవాడను పట్టించుకోలేదు
- అందుకే ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా అభివృద్ధి చెందలేదు
సాక్షి, విజయవాడ బ్యూరో: టెక్నాలజీలో రాష్ట్రాన్ని మరో సిలికాన్ వ్యాలీగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి స్కూల్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్‌గా పనిచేసేలా ప్రోత్సహిస్తామన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఈఓలా పనిచేస్తే కొందరు తనకు ఓట్లేయలేదని, ఇది రాజకీయ వాస్తవమన్నారు. చీఫ్ మినిస్టర్.. చీఫ్ మినిస్టర్‌గానే పనిచేయాలని తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువని, ఇక్కడినుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్‌తోపాటు అనేకమంది పారిశ్రామికవేత్తలు వచ్చినా ఎవరూ ఇక్కడ వ్యాపారాలు పెట్టలేదని చెప్పారు. అందుకే విజయవాడలో ఒక్క పరిశ్రమ కూడా అభివృద్ధి చెందలేదన్నారు. సోమవారం నగరంలోని ఒక హోటల్‌లో బిజినెస్ స్టాండర్డ్ దినపత్రిక పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ఏపీ రౌండ్‌టేబుల్ సమావేశంలో బాబు మాట్లాడారు.
సింగిల్ డెస్క్ విధానం ద్వారా ఇప్పటివరకు 1,756 పరిశ్రమలకు 21 రోజుల్లో అన్ని అనుమతులూ ఇచ్చామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కింద ఈ ఏడాది రూ.958 కోట్లతో 995 యూనిట్లు ఏర్పాటు చేసి 16 వేల మందికి ఉద్యోగాలిచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్లే తామూ ఇవ్వాల్సివచ్చిందని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ ఎస్‌కే భట్టాచార్య.. గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్య, కార్మిక సంస్కరణల్లో ప్రభుత్వ దార్శనికత ఏమిటని ప్రశ్నించారు. అలాగే టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ, పారిశ్రామికవేత్త సాంబమూర్తి తదితరులు వేసిన ప్రశ్నలకు బాబు జవాబిచ్చారు. పారిశ్రామికవేత్తలు జాస్తి వెంకట్, వీపీ రమేష్ లోక్‌నాథన్, నాగరాజులు పాల్గొన్నారు.
పెట్టుబడులు పెట్టేవరకు వెంటపడతా
‘పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఈ పెట్టుబడులు పెట్టేవరకు మీ వెంట పడతాను. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేస్తాం. ఒప్పందంలో అనుకున్నట్లుగా చేయకపోతే ఊరుకోం. మా అధికారులతో సమస్యలు ఉంటే అప్పటికప్పుడే పరిష్కరిస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటకరంగ పెట్టుబడిదారులకు తేల్చిచెప్పారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో పర్యాటక మిషన్, పర్యాటక విధానాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే ప్రాజెక్టులకు సంబంధించి రూ.830 కోట్ల విలువైన తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. అలాగే రూ.3,845 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) కుదుర్చుకున్నారు.