ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూసీ) ఉద్యోగ, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం వల్ల దేశవ్యాప్తంగా 5.15కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తాజా సర్వేలో తేలింది. వీటిలో 93.5 లక్షల బ్రాహ్మణ కుటుంబాలుండగా.. 4.21కోట్ల కుటుంబాలు ఇతర వర్ణాలకు చెందినవిగా వెల్లడైంది. కాగా, 10% కోటా వల్ల పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ లబ్ధి పొందుతాయని, దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల్లో 42% ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని ‘బిజినెస్ స్టాండర్డ్’ సర్వేలో తేలింది.
మేరీ ల్యాండ్ యూనివర్సిటీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్‌లైడ్ ఎకనమిక్ రీసెర్చ్‌లు చేపట్టిన ‘ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే (ఐహెచ్‌డీఎస్) గణాంకాల ప్రకారం 2016–17 ఆదాయ రికార్డుల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు సర్వే పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం 124వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన ఈ 10% రిజర్వేషన్ల ప్రకారం.. ఏడాదికి 8లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది ప్రస్తుత ఓబీసీ క్రీమీలేయర్‌తో సమానం. 1993లో ఓబీసీ క్రీమీలేయర్ పరిమితి ఏడాదికి లక్ష రూపాయలు ఉండగా, క్రమంగా పెరుగుతూ 2017 నాటికది రూ. 8లక్షలకు చేరింది. ప్రస్తుతం ఈ పరిమితే కొనసాగుతోంది. ఐహెచ్‌డీఎస్ లెక్కల ప్రకారం దేశంలో 1.25కోట్ల బ్రాహ్మణ కుటుంబాలుంటే, వాటిలో 93 లక్షల కుటుంబాల వార్షికాదాయం రూ.8 లక్షల రూపాయల లోపేనని సర్వే వివరించింది.
బ్రాహ్మణేతర కుటుంబాల్లో 4.21 కోట్ల కుటుంబాల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఈ కోటా వల్ల లబ్ధి పొందే కుటుంబాల్లో 17.2% పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌లో 13.3%, మహారాష్ట్రలో 12%, ఆంధ్రప్రదేశ్‌లో 5.8%, గుజరాత్‌లో 5.4%, బిహార్‌లో 5%, మధ్యప్రదేశ్‌లో 4.8% ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 36.5% ఉన్నాయి.ఈ కుటుంబాల్లో మూడింట రెండొంతులు గ్రామాల్లోనే నివసిస్తున్నాయని కూడా సర్వే వెల్లడించింది.
5.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి
Published Thu, Jan 17 2019 1:40 AM | Last Updated on Thu, Jan 17 2019 1:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment