OBC Creamy layer
-
‘ఓబీసీ నాన్ క్రిమిలేయర్ల దరఖాస్తు రుసుము తగ్గించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ స్థాయి పోటీ పరీక్షల విషయంలో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ల దరఖాస్తు రుసుమును తగ్గించాలని, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ఉంచాలని ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఓబీసీలను క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్లుగా విభజించారని తెలిపారు. రిజర్వేషన్లతో పాటు ఇతర ప్రయోజనాలు రెండు వర్గాలకు సమానంగా అందుతున్నాయని అన్నారు. కానీ, వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల దరఖాస్తు రుసుము విషయంలో నాన్ క్రిమిలేయర్లు ఓసీలతో సమానంగా చెల్లించాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నాన్ క్రిమిలేయర్ ఓబీసీలను ఆర్థికంగా వెనుకబడిన తరగతిగా గుర్తిస్తున్నాయని, జాతీయ స్థాయి పరీక్షల దరఖాస్తు రుసుము విషయంలో అది చెల్లుబాటు కావటం లేదన్నారు. వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేవలం రూ. 200 మాత్రమే దరఖాస్తుకు చెల్లించగలరన్నారు. ఈ మేరకు జాతీయ స్థాయి పరీక్షల దరఖాస్తు రుసుము విషయంలో ఓబీసీ నాన్ క్రిమిలేయర్లను ఎస్టీ, ఎస్టీలతో సమానంగా ఉండేలా చూడాలని మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
బీసీ క్రీమీ లేయర్‌పై నిపుణుల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వర్గాలలో క్రీమీ లేయర్ నిర్ధారణకు సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యల పరిశీలన కోసం ఈ ఏడాది మార్చి 8న మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి బీపీ శర్మ అధ్యక్షతన ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి బుధవారం రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. నిపుణుల సంఘం విధి విధానల గురించి మంత్రి తన జవాబులో వివరిస్తూ వెనుకబడిన తరగతులలో క్రీమీ లేయర్ (ఆర్థికస్థితి మెరుగ్గా ఉన్నవారు) నిర్ధారణ కోసం గతంలో నియమించిన ప్రసాద్ కమిటీ అనుసరించిన ప్రాతిపదికను లోతుగా పరిశీలిస్తుందని చెప్పారు. ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్రీమీ లేయర్ విధానాన్ని సరళతరం, క్రమబద్ధీకరించే దిశగా తగిన సిఫార్సులు చేయడం శర్మ కమిటీకి నిర్దేశించిన విధి విధానాలలో ఒకటని మంత్రి చెప్పారు. అలాగే కేటగిరీ 2 సీ కింద ప్రభుత్వ రంగ సంస్థలలో బీసీలకు ఉద్యోగ ఖాళీల సంఖ్యను నిర్ధారించడానికి కూడా తగిన సిఫార్సులను ఈ నిపుణుల కమిటీ చేస్తుందని చెప్పారు. క్రీమీ లేయర్‌కు సంబంధించి సివిల్ సర్వీసెస్ అభ్యర్ధులు దాఖలు చేసిన అపరిష్కృత కేసులను శర్మ కమిటీ పరిశీలిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం బీసీ సర్టిఫికెట్ సమర్పించిన అభ్యర్ధులలో క్రీమీ లేయర్ వారిని గుర్తించి తొలగించడానికి అనుసరించవలసిన ఆచరణ సాధ్యమైన విధానాన్ని ఈ కమిటీ రూపొందిస్తుందని మంత్రి చెప్పారు. 2017 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన బీసీ అభ్యర్ధుల సర్టిఫికెట్లను యూపీపీఎస్సీ తిరస్కరించిన నేపథ్యంలో తిరస్కరణకు గురైన ప్రతి కేసుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన మీదట ఈ కమిటీ నిర్దిష్టమైన సిఫార్సు చేస్తుందని మంత్రి వివరించారు. -
5.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి
ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూసీ) ఉద్యోగ, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం వల్ల దేశవ్యాప్తంగా 5.15కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తాజా సర్వేలో తేలింది. వీటిలో 93.5 లక్షల బ్రాహ్మణ కుటుంబాలుండగా.. 4.21కోట్ల కుటుంబాలు ఇతర వర్ణాలకు చెందినవిగా వెల్లడైంది. కాగా, 10% కోటా వల్ల పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ లబ్ధి పొందుతాయని, దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల్లో 42% ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని ‘బిజినెస్ స్టాండర్డ్’ సర్వేలో తేలింది. మేరీ ల్యాండ్ యూనివర్సిటీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్‌లు చేపట్టిన ‘ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (ఐహెచ్‌డీఎస్) గణాంకాల ప్రకారం 2016–17 ఆదాయ రికార్డుల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు సర్వే పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 124వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన ఈ 10% రిజర్వేషన్ల ప్రకారం.. ఏడాదికి 8లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది ప్రస్తుత ఓబీసీ క్రీమీలేయర్‌తో సమానం. 1993లో ఓబీసీ క్రీమీలేయర్ పరిమితి ఏడాదికి లక్ష రూపాయలు ఉండగా, క్రమంగా పెరుగుతూ 2017 నాటికది రూ. 8లక్షలకు చేరింది. ప్రస్తుతం ఈ పరిమితే కొనసాగుతోంది. ఐహెచ్‌డీఎస్ లెక్కల ప్రకారం దేశంలో 1.25కోట్ల బ్రాహ్మణ కుటుంబాలుంటే, వాటిలో 93 లక్షల కుటుంబాల వార్షికాదాయం రూ.8 లక్షల రూపాయల లోపేనని సర్వే వివరించింది. బ్రాహ్మణేతర కుటుంబాల్లో 4.21 కోట్ల కుటుంబాల వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఈ కోటా వల్ల లబ్ధి పొందే కుటుంబాల్లో 17.2% పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌లో 13.3%, మహారాష్ట్రలో 12%, ఆంధ్రప్రదేశ్‌లో 5.8%, గుజరాత్లో 5.4%, బిహార్‌లో 5%, మధ్యప్రదేశ్‌లో 4.8% ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 36.5% ఉన్నాయి.ఈ కుటుంబాల్లో మూడింట రెండొంతులు గ్రామాల్లోనే నివసిస్తున్నాయని కూడా సర్వే వెల్లడించింది. -
‘క్రిమిలేయర్ ’ కొనసాగుతుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్ల అమలులో క్రిమిలేయర్ నిబంధనను తొలగించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని సామాజిక న్యాయ శాఖ మంత్రి కృష్ణ పాల్ గుర్జర్ రాజ్య సభలో గురువారం స్పష్టం చేశారు. ఓబీసీలలో క్రిమిలేయర్ కేటగిరీకి ఆదాయ పరిమితిని ఏడాదికి 6 నుంచి 8 లక్షలకు పెంచాలని జాతీయ బీసీ కమిషన్ సిఫార్సు చేసిందా? అని సంబంధిత మంత్రిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి కోరగా.. మంత్రి లేదని జవాబిచ్చారు. ఓబిసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ నిర్ధారణ కోసం వినియోగదారుల ధరల సూచీని ప్రాతిపదికగా చేసుకుని 2013లో ఎలాగైతే ఆదాయ పరిమితిని ఏడాదికి రూ. 6 లక్షలకు పెంచారో.. అదే ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న ఆదాయ పరిమితిని ఏడాదికి రూ.8 లక్షల పెంచినట్లు కృష్ణ పాల్ తెలిపారు. ఓబీసీ క్రిమిలేయర్ కొనసాగుతుంది.. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలలో కూడా క్రిమిలేయర్ విధానాన్ని తొలగించి రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయా సంఘాలుప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం వాస్తవమేనా అని అడగగా.. క్రిమిలేయర్ నిబంధనను తొలగించాలంటూ ఓబీసీ నాయకులు, సంఘాలు డిమాండ్ చేస్తున్న మాట వాస్తవమన్నారు. అయితే ఇందిరా సహానీ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ప్రభుత్వం క్రీమీ లేయర్ విధానాన్ని అమలు చేస్తోందని వెల్లడించారు. ఆదివాసీల వివరాలు లేవు.. భారత దేశంలోని పెద్ద పులుల అభయారణ్యాలలో నివసించే ఆదివాసీలు, ఇతర గిరిజనుల వివరాలేవీ తమ వద్ద లేవని విజయసాయి రెడ్డి ప్రశ్నకు సమాధానం ఆదివాసీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్ ఇచ్చారు. వన్యప్రాణుల అభయారణ్యాలుగా గుర్తించిన ప్రాంతాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లుగా అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో పులుల అభయారణ్యాలలో నివసించే ఆదివాసీలు, గిరిజనులకు అటవీ హక్కుల చట్టాల ప్రకారం వారి హక్కులను పరిరక్షించాల్సిన విషయం వాస్తవమేనా అన్న ప్రశ్నకు మంత్రి అవునని జవాబిచ్చారు. అటవీ హక్కుల చట్టాల్ని అతిక్రమిస్తూ ఆదివాసీలు, గిరిజనులను బలవంతంగా అడవుల నుంచి తరిమేస్తున్న కేసులు ఏవైనా ప్రభుత్వం దృష్టికి వచ్చాయా అన్న ప్రశ్నకు, ఇప్పటి వరకు అలాంటి సంఘటనలేవీ తమ దృష్టికి రాలేదని భగత్ తెలిపారు. -
ఓబీసీ ఆదాయ పరిమితి పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: ఓబీసీ కోటా పొందేందుకు క్రీమిలేయర్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 6లక్షల నుంచి రూ 8లక్షలకు పెంచారు. దీనిప్రకారం వరుసగా మూడేళ్ల పాటు రూ 8 లక్షలు అంతకుమించి వార్షికాదాయం ఉన్న తల్లితండ్రుల పిల్లలు క్రీమీలేయర్ కేటగిరీ పరిథిలోకి వస్తారు. ఇతర వెనుకబడిన తరగుతుల వారికి వర్తించే రిజర్వేషన్ ప్రయోజనాలు వీరికి వర్తించవు. ఓబీసీల్లో క్రీమిలేయర్ పరిధిని నిర్ధారించేందుకు వార్షికాదాయ పరిమితిని రూ 6 లక్షల నుంచి రూ 8 లక్షలకు పెంచినట్టు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1993లో రూ లక్షగా ఉన్న క్రీమిలేయర్ పరిమితిని 2004లో రూ 2.5 లక్షలకు, 2008లో రూ 4.5 లక్షలకు 2013లో రూ 6 లక్షలకు పెంచారు. -
ఓబీసీ క్రీమీలేయర్ రూ.8 లక్షలు
♦ ఓబీసీ వర్గీకరణకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు ♦ కేంద్ర కేబినెట్ నిర్ణయం ♦ ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థను ముట్టుకోం ♦ ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనల్లేవని స్పష్టీకరణ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఓబీసీల వార్షిక ఆదాయ పరిమితి (క్రీమీలేయర్)ని రూ. 8 లక్షలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతోపాటుగా.. రిజర్వేషన్ లాభా లను అందరికీ సమానంగా అందజేయాలన్న లక్ష్యంతో కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల వర్గీకరణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఓబీసీల క్రీమీలేయర్‌ను ఏడాదికి రూ. 6లక్షల నుంచి 8 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. ఎస్సీల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదనలూ లేవని స్పష్టం చేశారు. క్రీమీలేయర్‌పై.. ఇటీవల అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ ఓబీసీల క్రీమీలేయర్ పెంపుపై సంకేతాలిచ్చారు. ఓబీసీల వర్గీకరణ జరగాల్సిన అవసరాన్నీ పునరుద్ఘాటించారు. 1993లో ఓబీసీల క్రీమిలేయర్ రూ.లక్షగా నిర్ణయించగా.. 2004లో దీన్ని రూ.2.5 లక్షలకు పెంచారు. అనంతరం 2008లో రూ.4.5 లక్షలకు పెంచగా.. 2014లో రూ.6 లక్షల పరిధిని నిర్ణయించారు. ప్రస్తుతం దీన్ని మరో రెండు లక్షలు పెంచి 8లక్షలకు తెచ్చినట్లు జైట్లీ తెలిపారు. రిజర్వేషన్ ఫలాలందించేందుకే.. రిజర్వేషన్ ఫలాలను ఓబీసీలకు మరింత సమర్థవంతంగా అందజేసేందుకు ఓబీసీ వర్గీకరణ చేపట్టేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించిందని జైట్లీ వెల్లడించారు. కమిషన్‌కు చైర్మన్ నియామకం జరిగిన తర్వాత 12 వారాల్లో నివేదిక అందుతుందన్నారు. ‘ఈ కమిషన్ ఓబీసీ కేటగిరీల్లో (కేంద్ర జాబితాలోని)ని కులాలు, వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందుతున్నాయో లేదో పరిశీలిస్తుంది. ఓబీసీల్లో వర్గీకరణకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలను ఈ కమిషన్ ఖరారు చేస్తుంది’ అని జైట్లీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఓబీసీల వర్గీకరణ చేపట్టారన్నారు. కాగా, ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థపై ప్రభుత్వం పునరాలోచనలో ఉందంటూ వస్తున్న వార్తలను జైట్లీ ఖండించారు. 2015లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ విధానాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చేసిన వ్యాఖ్యలపై జైట్లీ పైవిధంగా స్పందించారు. అయితే రిజర్వేషన్‌పై సమీక్షించాలనే ప్రతిపాదనేదీ లేదని.. భవిష్యత్తులో ఉండదని కూడా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పెంచాలనే ప్రతిపాదనకూ కేబినెట్ మౌఖికంగా ఆమోదించినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల విస్తరణ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. బీజేపీ నేతల హర్షం ఓబీసీల క్రీమీలేయర్ పెంపు, వర్గీకరణ అంశాలపై నిర్ణయం తీసుకోవటం పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అద్వితీయం, చారిత్రకమని ప్రశంసించారు. కొన్నేళ్లుగా ఓబీసీలు చేస్తున్న రెండు కీలకమైన డిమాండ్లను కేంద్రం అంగీకరించినట్లయిందన్నారు. ‘వెనుకబడిన తరగతుల సాధికారత కోసం ఇదో అద్వితీయమైన నిర్ణయం. దీంతో చాలామందికి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపీందర్ యాదవ్, కేంద్ర మంత్రి సంతోశ్ గంగ్వార్ పేర్కొన్నారు. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పథకానికి ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన’గా పేరు మార్చేందుకు అంగీకారం. రూ.6వేల కోట్లు కేటాయించిన ఈ పథకం ద్వారా 2020 నాటికి 20 లక్షల మంది రైతులకు మేలు కలగటం, 5.30 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యం. నేపాల్ సరిహద్దులో మేచీ నదిపై రూ. 159కోట్లతో వంతెన నిర్మాణానికి ఆమోదం.