ఓబీసీ క్రీమీలేయర్ రూ.8 లక్షలు
♦ ఓబీసీ వర్గీకరణకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
♦ కేంద్ర కేబినెట్ నిర్ణయం
♦ ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థను ముట్టుకోం
♦ ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనల్లేవని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఓబీసీల వార్షిక ఆదాయ పరిమితి (క్రీమీలేయర్)ని రూ. 8 లక్షలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతోపాటుగా.. రిజర్వేషన్ లాభా లను అందరికీ సమానంగా అందజేయాలన్న లక్ష్యంతో కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల వర్గీకరణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఓబీసీల క్రీమీలేయర్‌ను ఏడాదికి రూ. 6లక్షల నుంచి 8 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. ఎస్సీల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదనలూ లేవని స్పష్టం చేశారు.
క్రీమీలేయర్‌పై..
ఇటీవల అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ ఓబీసీల క్రీమీలేయర్ పెంపుపై సంకేతాలిచ్చారు. ఓబీసీల వర్గీకరణ జరగాల్సిన అవసరాన్నీ పునరుద్ఘాటించారు. 1993లో ఓబీసీల క్రీమిలేయర్ రూ.లక్షగా నిర్ణయించగా.. 2004లో దీన్ని రూ.2.5 లక్షలకు పెంచారు. అనంతరం 2008లో రూ.4.5 లక్షలకు పెంచగా.. 2014లో రూ.6 లక్షల పరిధిని నిర్ణయించారు. ప్రస్తుతం దీన్ని మరో రెండు లక్షలు పెంచి 8లక్షలకు తెచ్చినట్లు జైట్లీ తెలిపారు.
రిజర్వేషన్ ఫలాలందించేందుకే..
రిజర్వేషన్ ఫలాలను ఓబీసీలకు మరింత సమర్థవంతంగా అందజేసేందుకు ఓబీసీ వర్గీకరణ చేపట్టేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించిందని జైట్లీ వెల్లడించారు. కమిషన్‌కు చైర్మన్ నియామకం జరిగిన తర్వాత 12 వారాల్లో నివేదిక అందుతుందన్నారు. ‘ఈ కమిషన్ ఓబీసీ కేటగిరీల్లో (కేంద్ర జాబితాలోని)ని కులాలు, వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందుతున్నాయో లేదో పరిశీలిస్తుంది. ఓబీసీల్లో వర్గీకరణకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలను ఈ కమిషన్ ఖరారు చేస్తుంది’ అని జైట్లీ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఓబీసీల వర్గీకరణ చేపట్టారన్నారు. కాగా, ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థపై ప్రభుత్వం పునరాలోచనలో ఉందంటూ వస్తున్న వార్తలను జైట్లీ ఖండించారు. 2015లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ విధానాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చేసిన వ్యాఖ్యలపై జైట్లీ పైవిధంగా స్పందించారు. అయితే రిజర్వేషన్‌పై సమీక్షించాలనే ప్రతిపాదనేదీ లేదని.. భవిష్యత్తులో ఉండదని కూడా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పెంచాలనే ప్రతిపాదనకూ కేబినెట్ మౌఖికంగా ఆమోదించినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల విస్తరణ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
బీజేపీ నేతల హర్షం
ఓబీసీల క్రీమీలేయర్ పెంపు, వర్గీకరణ అంశాలపై నిర్ణయం తీసుకోవటం పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అద్వితీయం, చారిత్రకమని ప్రశంసించారు. కొన్నేళ్లుగా ఓబీసీలు చేస్తున్న రెండు కీలకమైన డిమాండ్లను కేంద్రం అంగీకరించినట్లయిందన్నారు. ‘వెనుకబడిన తరగతుల సాధికారత కోసం ఇదో అద్వితీయమైన నిర్ణయం. దీంతో చాలామందికి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపీందర్ యాదవ్, కేంద్ర మంత్రి సంతోశ్ గంగ్వార్ పేర్కొన్నారు.
మరిన్ని కేబినెట్ నిర్ణయాలు
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పథకానికి ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన’గా పేరు మార్చేందుకు అంగీకారం. రూ.6వేల కోట్లు కేటాయించిన ఈ పథకం ద్వారా 2020 నాటికి 20 లక్షల మంది రైతులకు మేలు కలగటం, 5.30 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యం.
నేపాల్ సరిహద్దులో మేచీ నదిపై రూ. 159కోట్లతో వంతెన నిర్మాణానికి ఆమోదం.