సంగారెడ్డి మున్సిపాలిటీ : విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉన్నత అధికారులు కొరడా ఝలిపించారు. ఏకంగా ముగ్గురు ప్రధానోపాధ్యాయులను సస్పెండ్‌చేస్తూ శుక్రవారం విద్యాశాఖ ఆర్జేడీఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు తెలిపారు. సిద్దిపేటలోని నూతన ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జయచంద్రారెడ్డి విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని స్థానికులు ఫిర్యాదుచేయడంతో తాము విచారణ జరిపామన్నారు. ఈమేరకు నివేదికను ఆర్జేడీకి సమర్పించగా, శుక్రవారం అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అలాగే జహీరాబాద్ మండలం మాందాపూర్ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలు బుజ్జమ్మ పాఠశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి తదుపరి చర్యల కోసం ఆర్జేడీకి పంపగా, ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
ఇక మునిపల్లి మండలం బుధేరా జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని ఫిర్యాదు అందడంతో జిల్లా విద్యాశాఖ తరఫున విచారణ జరిపి నోటీసులు జారీ చేయగా, ఆమె నోటీసులకు స్పందించకపోవడంతో ఆర్జేడీకి నివేదిక అందజేశామన్నారు. దీంతో ఆర్జేడీ మల్లేశ్వరిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
ముగ్గురు హెచ్‌ఎంల సస్పెన్షన్
Published Sat, Jul 19 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement