మెదక్: విద్యార్థుల చదువు భారమంతా గురువులపైనే పడింది. విద్యార్థులకు చదవడం రాకుంటే టీచర్లపై సస్పెన్షన్ వేటు వేసేందుకు వెనకాడేది లేదని జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు ప్రకటించారు. పదో తరగతిలో రెండేళ్లుగా వస్తున్న చేదు ఫలితాలను మెరుగుపర్చేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. విద్యార్థుల శారీరక ఆరోగ్యంపైనే...మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న ఉద్దేశంతో కలెక్టర్ పాఠశాల స్థాయిలోనే జవహర్ బాల ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేసి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఈఓ రాజేశ్వర్‌రావు, హెచ్‌ఎంలు, ఎంఈఓల సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 502 ఉన్నత పాఠశాలలు ఉండగా, ఈ సారి పదో తరగతి పరీక్షలకు 42,035 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రెండేళ్లుగా జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే పరిస్థితి దారుణంగా ఉంది. 2012-13లో ఉమ్మడి రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో మెదక్ జిల్లా చివరగా 23వ స్థానానికి పడిపోయింది. 2013-14లో కాస్త మెరుగుపడినా 83.01 ఉత్తీర్ణత శాతంతో 21 స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా సరే పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు జిల్లా కలెక్టర్, డీఈఓ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
విద్యార్థులకు చదవడం రాకుంటే టీచర్లపై వేటే
ప్రతి పాఠశాలలో విద్యార్థులంతా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో తప్పులు లేకుండా పాఠ్యాంశాలను చదవకుంటే సంబంధిత ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తామని డీఈఓ రాజేశ్వర్‌రావు హెచ్చరించారు. ఇందుకు సంబంధించి పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే ఆయన ఒక ప్రకటన చేశారు. నవంబర్ 14లోగా ఉపాధ్యాయులంతా విద్యార్థులకు బేసిక్స్‌తోపాటు తప్పులు లేకుండా చదవడం, రాయడం నేర్పాలని ఆదేశించారు. లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని అప్పట్లోనే ఆయన హెచ్చరించారు. ఈ మేరకు వాటిని అమలు పర్చడానికి జిల్లాలోని అన్ని పాఠశాలలను సందర్శించనున్నట్లు చెప్పారు.
డిసెంబర్ 1 నుంచి ప్రత్యేక యాక్షన్ ప్లాన్
డిసెంబర్ 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలులోకి తీసుకురావాలని డీఈఓ రాజేశ్వర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు డిసెంబర్ 1 నుంచి 2015 మార్చి 7వ తేదీ వరకు ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతిరోజు 8, 9 పీరియడ్లలో ఒక్కో సబ్జెక్ట్‌కు 11 రోజుల చొప్పున ప్రత్యేక పునశ్చరణ నిర్వహించాలని సూచించారు. గంట 20 నిమిషాల సమయంలో 15 నిమిషాలు చర్చకు, 30 నిమిషాలు విద్యార్థులను చదివించడానికి, 30 నిమిషాలు పరీక్ష నిర్వహించడానికి, 5 నిమిషాలు సూచనలు ఇవ్వడానికి వినియోగించుకోవాలని ఆదేశించారు. చదువులో వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని ఉపాధ్యాయులు వారి సామర్థ్యాలను మెరుగు పర్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు. వారి వైఫల్యాలకు సంబంధిత ఉపాధ్యాయులే బాధ్యులని స్పష్టం చేశారు.
జవహర్‌బాల ఆరోగ్య పథకంతో ఫలితాలు
శారీరక ఆరోగ్యంపైనే మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న ఉద్దేశంతో పాఠశాలల్లో జవహర్ బాల ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. రెండేళ్లుగా పాఠశాలల్లో ఈ పథకం సక్రమంగా కొనసాగడం లేదని, సుమారు 40 శాతం మంది విద్యార్థులకు ఆరోగ్య కార్డులు లేవన్న విషయాన్ని ఆయన గుర్తించారు. వెంటనే విద్యార్థులకు కార్డులు అందజేసి ప్రతి నెల క్రమం తప్పకుండా తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు.
గురువుపైనే బరువు
Published Thu, Nov 27 2014 11:36 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement