నిర్లక్ష్యంపై విద్యాశాఖ కొరడా
ప్రభుత్వ పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీ
ఒకరి సస్పెన్షన్, ముగ్గురికి మెమోలు
సిద్దిపేట జోన్: ‘‘ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయినా సంబంధిత టీచర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం.. అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనకాడబోం’’ రెండు నెలల క్రితం టీచర్లకు డీఈఓ జారీ చేసిన హెచ్చరిక. కట్ చేస్తే.. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ జెడ్పీ పాఠశాలను శుక్రవారం డీఈఓ రాజేశ్వర్‌రావు అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా బోధనలో విఫలమయ్యారనే కారణంతో ఇందిరానగర్ స్కూల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు మరో ముగ్గురికి మెమోలు జారీ చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది.
శుక్రవారం సిద్దిపేటకు వచ్చిన డీఈఓ రాజేశ్వర్‌రావు ముందుగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని స్కూల్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని, వెనక భాగంలో ఉన్న పురాతన భవనాన్ని పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం బ్యాంక్ నిర్మాణం కోసం సంబంధిత పాఠశాల స్థలాన్ని, భవనాన్ని స్వాధీనం చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో సమగ్ర వివరాలు సేకరించారు. అనంతరం పదో తరగతి గదిని పరిశీలించి, విద్యార్థులను వివిధ పాఠ్యాంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి సంబంధిత పేపర్లను తీసుకెళ్లారు.
ఇటీవల జరిగిన పదో తరగతి త్రైమాసిక పరీక్ష ప్రశ్నాపత్రాలను, పాఠశాల విద్యార్థుల మార్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇందిరానగర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకున్న డీఈఓ, పాఠశాల ఆవరణ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హెచ్‌ఎం వకులాదేవికి సూచించారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.
పదో తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల రూపకల్పనలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుడు నిరంజన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. సంబంధిత సబ్జెక్టుల్లో విద్యార్థుల ఫెయిల్ శాతం అధికంగా ఉందన్న కారణంతో అదే పాఠశాలకు చెందిన కొండల్‌రెడ్డి, శ్రీవిద్యలతో పాటు గైర్హాజరైన నీలం రెడ్డికి మెమోలు జారీ చేశారు. దీనికి బాధ్యులైన ఉపాధ్యాయుల రెండు ఇంక్రిమెంట్లలో కోత విధిస్తామని హెచ్చరించారు.
మీరు మారండి.. విద్యార్థుల రాత మార్చండి...
ప్రతి నెల వేల రూపాయల వేతనం పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాబోధనలోనూ మార్పు తెచ్చి విద్యార్థుల రాతను మార్చాలని డీఈఓ రాజేశ్వర్‌రావు సూచించారు. అందుకోసం ముందుగా ఉపాధ్యాయుల్లోనే మార్పు రావాలన్నారు. తనిఖీ నిర్వహించిన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతోప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం మరింత పెంచాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ముఖ్యంగా సీఎం జిల్లాలో విద్యా ఫలితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన వెంట ఉప విద్యాధికారి మోహన్, జిల్లా విద్యాశాఖ సిబ్బంది సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పంతుళ్లూ..పైలమయో!
Published Sat, Dec 6 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement