న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ను పరాజయం వెంటాడుతోంది. ఎన్ని ఎన్నికలు వచ్చిపోతున్నా కాంగ్రెస్ భవితవ్యం మారడం లేదు. తొలుత హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలయ్యింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఓటమిని చవిచూసింది. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచినా మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. శరద్ పవార్ ఎన్‌సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీని అధికారం నుంచి కాంగ్రెస్ గద్దె దించలేకపోయింది. మహాయుతి తుఫానులో మహావికాస్ అఘాడీ కనుమరుగయ్యింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ కేవలం 50 సీట్లకే పరిమితమైంది.
మహారాష్ట్రలో మహాయుతి విజయం సాధిస్తుందనే అంచనాలున్నప్పటికీ, ఇంత భారీ విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 234 స్థానాలను మహాయుతి గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాల్లో కాషాయ జెండాను ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు గెలుచుకోగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకోగలిగింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 10 సీట్లు, ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు 20 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
మహారాష్ట్రలో 100 సీట్లకు పైగా పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పుడు హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఓటమిపై కాంగ్రెస్‌లోనే నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి పార్టీ కేంద్ర నాయకత్వంలో పునర్వ్యవస్థీకరణ డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి.
అలాగే ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది పార్లమెంటు సభ్యుల సమూహం(జీ23) మరింత యాక్టివ్ కావాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్‌లోని జీ23 గ్రూపులోని కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్‌ను వీడారు. వీరు గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆనంద్ శర్మ, శశి థరూర్, హుడా వంటి నాయకులు మాత్రమే మిగిలారు. ఈ నేపధ్యంలో జీ 23 మరింత బలపడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మహాయుతి దెబ్బకు ‘ఎల్‌వోపీ’ సీటు గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment