2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమి పేరుతో ఎన్డీఏను ఢీకొట్టాలని భావించాయి. అయితే ఇప్పుడు అదే ఇండియా కూటమి విచ్ఛిన్నం కాబోతోంది. వాస్తవానికి 2023లో దేశంలోని 26 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ 26 ప్రధాన పార్టీల కలయికతో ఇండియా అలయన్స్ (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) ఏర్పాటయ్యింది.
లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం
ప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షునిగా ఉన్న కాంగ్రెస్ ఈ కూటమికి సారధ్యం వహిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీని పొందలేకపోయింది. ఇండియా కూటమిలో చేరిన పార్టీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. వీటిలో ముందుగా మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి విడిపోతున్నట్లు మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. దీనికి ముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీ - కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. లోక్‌సభలో అవధేష్ ప్రసాద్‌ను వెనక్కి పంపడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
షాకిచ్చిన మమతా బెనర్జీ
ఇండియా కూటమిలో కొనసాగుతున్న సమాజ్‌వాదీ పార్టీ అసంతృప్తి మధ్య, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా విపక్షాలకు షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ఓటమి తర్వాత మమతా బెనర్జీ.. బెంగాల్ నుండే కూటమి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇండియా అలయన్స్‌కు నాయకత్వం వహించే బాధ్యతను ఆమె కోరుకుంటున్నారా లేక ఇండియా అలయన్స్ నుండి ఆమె వేరుపడుతున్నారా అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది. ఒక ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ ఇండియా కూటమి సృష్టికర్త తానేనని, దానిని నిర్వహించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉందన్నారు. కానీ వారు దానిని సమర్థవంతంగా నెరవేర్చలేకపోతే తానేమి చేయగలనని ప్రశ్నించారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇటీవల మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకురాలిగా అభివర్ణించారు.
కూటమిని వీడిన ఆమ్ ఆద్మీ పార్టీ
వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీలో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. దీనికిముందు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. దీనిని చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి విడిపోతున్నట్లు కనిపిస్తోంది.
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత..
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో 26 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూటమికి దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌ను పక్కన పెట్టి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇండియా కూటమిలో కొనసాగుతున్న ఈ విచ్ఛిన్నం విచ్చిన్నం ఆగుతుందా ఇంకా కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్‌మన్ సక్సెస్ స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment