1300 టీచర్ పోస్టులు ఖాళీ
డీఈఓ రాజేశ్వర్‌రావు
జగదేవ్‌పూర్: జిల్లాలో 1,300 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే వీటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా విద్యాధికారి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. గురువారం ఆయన, మండలంలోని చేబర్తి, ఎర్రవల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
అంతేకాకుండా జిల్లాలోని పలు పాఠశాలల్లో వంట గదులు, తాగునీటి సమస్య, ఉపాధ్యాయుల కొరతపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రస్తుతం 53 పాఠశాలల్లో తెలుగు పండితులు, 57 పాఠశాలలో ఉర్దూ టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో డిప్యుటేషన్ పద్ధతిపై టీచర్లను సర్దుబాటు చేస్తున్నామన్నారు.
జిల్లాలోని 26 ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఎంఈఓ సుగుణాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేబర్తి వాసులు తమ గ్రామంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని డీఈఓను కోరారు. డీఈఓ వెంట ప్రధానోపాధ్యాయులు జ్యోతి, జయసింహారెడ్డి, ఉపాధ్యాయులు సురేందర్‌రెడ్డి, యాదగిరి, స్వాతి, కుమార్, ఎస్‌ఎంసీ చైర్మన్ బాలచంద్రం, ఎర్రవల్లి సర్పంచ్ భాగ్య ఉన్నారు.