సంగారెడ్డి మున్సిపాలిటీ: సెలవు దినాల్లో పాఠశాల నిర్వహిస్తున్నట్లు సాక్షిలో ప్రచురితమైన వార్తపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు స్పందించారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని రిషి పబ్లిక్ స్కూల్ నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న డీఈఓ మండల విద్యాశాఖ అధికారిని పాఠశాలను సందర్శించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈమేరకు రిషి పబ్లిక్ పాఠశాల నిబంధనలకు విరుద్దంగా పాఠశాల నిర్వహించడంతో సీజ్ చేశారు. అనంతరం పట్టణంలోని పయనీర్, బ్రిలియంట్, సాయిగ్రేస్, ఎంఎన్‌అర్ పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ సెలవు దినాల్లో పాఠశాలలు నడిపితే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.
సెలవులిచ్చేందుకు సీఎం ఎవరు..
దసరా సెలవుల్లో పాఠశాల నిర్వహస్తున్న విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి అదేశాల మేరకు పట్టణంలోని రిషి పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాని సమీప బంధువు సెలవులు ప్రకటించడానికి మీరెవరు..?, తెలంగాణ వస్తే పాఠశాలలను మూసివేయాలా? అంటూ ఎంఈఓను నిలదీశారు.
దీంతో ఎంఈఓ తాము నిబంధనల ప్రకారం 23 నుంచి వచ్చే నెల 7 వరకు సెలవులు ప్రకటించామని అందుకు విరుద్ధంగా మీరు తరగతులు ఎలా నిర్వహిస్తారని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. దీంతో ఆమె బంధువు సెలవుల్లో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదా..? ఎందుకు బంద్ చేయాలి..? అసలు సెలవులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎవరు అంటూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎంఈఓ పాఠశాలనుసీజ్ చేశారు.
పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి: ఏబీవీపీ
సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్‌రెడ్డి డీఈఓ రాజేశ్వర్‌రావుకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 15 రోజులు సెలవులు ప్రకటిస్తే కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జహీరాబాద్, తూప్రాన్, ఇస్నాపూర్, సంగారెడ్డి తదితర ప్రాంతాలలో తరగతులు నిర్వహిస్తున్నారన్నారు.